తొలి టైటిల్ కోసం తుది పోరు..

  • చ‌రిత్ర లిఖించేద‌వ‌రు..
  • భార‌త్ – ద‌.ఆఫ్రికా ల‌ తొలి కప్పు క‌ల‌…

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. నేడు (ఆదివారం) నవీ ముంబైలోని డాక్టర్‌ డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు ప్రపంచకప్‌ టైటిల్‌ కోసం ఆఖరి పోరుకు సిద్ధమయ్యాయి.

అయితే ఈ ఫైనల్‌ పోరు మహిళల వన్డే చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది కానుంది. దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లను వెనక్కు నెట్టి, ఈసారి కొత్త ఛాంపియన్‌ పుట్టబోతోంది.

సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను రికార్డు చేధనతో ఓడించిన హర్మన్‌ప్రీత్‌ సేన… అద్భుత ఫామ్‌తో, ఉరకలేస్తున్న ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటివరకు భారత్‌ మూడోసారి ఫైనల్‌కు రాగా, దక్షిణాఫ్రికా మాత్రం తొలిసారిగా టైటిల్‌ రేసులో అడుగుపెట్టింది..

బరిలో ఫేవరెట్‌గా భారత్‌

స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచే అవకాశాలు భారత్‌కే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓపెనర్‌ స్మృతి మంథానా అద్భుత ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు 389 పరుగులు చేసి, ఒక సెంచరీతో పాటు మూడు హాఫ్‌సెంచరీలు సాధించింది. ఇక‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, అమన్‌జ్యోత్‌ కౌర్‌లతో బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బలంగా ఉంది. అంతేకాక, బౌలింగ్‌ విభాగం సమతూకంగా ఉండడం టీమిండియాకు అదనపు బలాన్నిస్తోంది.

దక్షిణాఫ్రికా సవాల్‌

లారా వోల్వార్ట్‌ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు కూడా ఈ టోర్నీలో దూకుడు చూపుతోంది. కెప్టెన్‌ వోల్వార్ట్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 470 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా వెలుగొందుతోంది. తజ్మిన్‌ బ్రిట్స్‌, మారిజాన్‌ కాప్‌, నాడిన్‌ డి క్లెర్క్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ త్రయం జోరును నియంత్రించగలిగితేనే భారత్‌ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోగలదు.

వరుణుడి ముప్పు

ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వర్షం కురిసే అవకాశాలు 25 శాతంగా ఉన్నట్లు తెలిపింది. వర్షం ఆటకు అంతరాయం కలిగిస్తే మ్యాచ్‌ను రిజర్వ్‌ డేకు వాయిదా వేయ‌చ్చు. అయితే, రిజర్వ్‌ డే నాటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే అవకాశముంది.

ఐసీసీ ప్రైజ్‌ మనీ ప్రకారం విజేత జట్టుకు రూ.40 కోట్లు, రన్నరప్‌కు రూ.20 కోట్లు లభించనున్నాయి. అయితే, టీమిండియా కప్‌ను కైవసం చేసుకుంటే మహిళా క్రికెటర్లకు బీసీసీఐ నుంచి రూ.125 కోట్ల భారీ బహుమతి ప్రకటించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply