AP | వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనం.. మంత్రి నారాయణ

  • పన్నుల ద్వారా కట్టిన వేలకోట్లు దారి మళ్లింపు…
  • కనీసం మ్యాచింగ్ ఫండ్ కూడా ఇవ్వని జగన్…
  • అప్పులు తీర్చడానికే కష్టంగా మారిన బడ్జెట్…
  • ఇకనుండి స్థానిక సంస్థల నిధులు వారికే….
  • విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మెరుగు పరుస్తాం…
  • పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం…
  • ఎమ్మెల్యే సుజన తో కలిసి సుజనా మిత్ర కార్యక్రమం ప్రారంభం…


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : అస్తవ్యస్తవ్య విధానాలతో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ విమర్శించారు. స్థానిక సంస్థల ద్వారా పన్నుల రూపంలో వచ్చిన వేల కోట్ల రూపాయలను దారి మళ్ళించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులకు కనీసం మ్యాచింగ్ పండు కూడా జగన్ ఇవ్వలేదన్న ఆయన, ప్రస్తుత బడ్జెట్ అప్పులు తీర్చడానికే సరిపోతుందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో స్థానిక సంస్థల నిధులు వారికే అందజేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరితో కలిసి ఆయన భవానిపురంలో సుజన మిత్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సుజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు డివిజన్ కోఆర్డినేటర్లకు ఎలక్ట్రిక్ బైకులను మంత్రి నారాయణ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సుజన చౌదరితో మంచి స్నేహం ఉంది, ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనాకి అపారమైన అనుభవం ఉందని, ప్రజాసేవకే ఆయన నిత్యం తపిస్తారని చెప్పారు. 2014-19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేదన్న మంత్రి నారాయణ ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుందన్నారు. 2019 లో ఏఐఐబి నుంచి 5380 కోట్ల నిధులు తీసుకొచ్చామని, కానీ గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధుల విడుదల నిలిచిపోయిందనీ గుర్తుచేశారు. గత ప్రభుత్వం నిధులు ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి మనిషికి 135లీటర్ల నీరందించే అవకాశం కలిగి ఉండేదన్నారు. మళ్ళీ సీఎం చంద్రబాబు చొరవతో నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 8500 అమృత్ పథకానికి నిధులిస్తే గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను నాశనం చేసిందని, చంద్రబాబు అపార అనుభవంతో చక్కదిత్తే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ప్రజలు వివిధ పన్నుల ద్వారా కట్టిన 3వేల కోట్ల నిధులు సీఎం ఎఫ్ఎస్ నుంచి ఇతర అవసరాలకు వాడేశారనీ, ఆ నిధులు ఉంచితే మున్సిపాలిటీలు తీవ్రంగా నష్టపోతాయనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పిన ఆయన ఇకపై మున్సిపాలిటీల నిధులు ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో విజయవాడ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు తిరిగి ప్రారంభిస్తామ‌ని ప్రకటించారు.

సుజన మిత్ర కార్యక్రమానికి త‌మ తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామని, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు సహకారం పూర్తిగా అందిస్తానన్నారు. ఎమ్మెల్యే సుజన చౌదరి మాట్లాడుతూ… ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమ‌ని, 9నెలలుగా చూసినా ఎవరూ ముందుకు రాలేదనీ, ప్రభుత్వం చేసే వరకు ఎదురు చూడకుండా మనమే పూనుకోవాలని పనులు ప్రారంభించినట్లు చెప్పారు. గత ఐదేళ్లలో ఖజానా దివాళా తీయించారని ఆరోపించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో కలసి పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాన్నారు. భవిష్యత్ లో సమస్యలు తలెత్తుకుండా అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయం చేయాలన్న ఆయన తర్వాత సేవకులుగా ఉండాలని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా చేయడం తన ఉద్దేశమని చెప్పారు. అసాంఘీక వ్యక్తులను అరికట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *