తొలి క‌ప్పు క‌ల‌కు మ‌రింత చేరువ‌లో…

  • ఆస్ట్రేలియా పరంపరకు బ్రేక్
  • ఫైనల్‌లోకి టీమ్‌ ఇండియా

భారత మహిళా క్రికెట్ జట్టు మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ టోర్నీలో ఈ టొర్నీలో అజేయంగా ఉన్న ఆస్ట్రేలియాను టీమిండియా మ‌ట్టిక‌రిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయంతో భారత మహిళల జట్టు 2025 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది.

కాగా, ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. వారి టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించింది. ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (119) శతకంతో చెలరేగగా, ఎలీస్ పెర్రీ (77), అష్లీ గార్డనర్‌ (63) అర్ధశతకాలు నమోదు చేశారు. దీంతో ఆసీస్ స్కోర్‌బోర్డ్ పరుగులు పెట్టింది. అయితే, తర్వాత భారత బౌలర్లు పుంజుకుని మిడిల్ ఆర్డర్‌, టెయిలెండర్లను త్వరగా ఔట్‌ చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో ఆలౌట్‌ అయ్యి 338 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రారంభంలో కొంత కష్టాల్లో పడింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ‌ (10) వేగంగా ఆరంభించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. ఇక‌, స్మృతి మంధాన‌ (24) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరింది. అయితే, తర్వాత భారత మిడిల్ ఆర్డర్‌ అద్భుత ప్రతిభను కనబరిచింది.

జెమీమా రోడ్రిగ్స్‌ (134 బంతుల్లో 127 నాటౌట్‌) అజేయ శతకంతో విరుచుకుపడింది. ఆమెకు తోడుగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్ దంచేసింది. హర్మన్‌ప్రీత్ 88 బంతుల్లో 89 ప‌రుగుల‌తో అర్ధశతకంతో చెలరేగింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 167 పరుగుల కీల‌క‌ భాగస్వామ్యాన్ని నమోదు చేసి మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పారు.

ఇక‌, చివర్లో దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26) కీలక పాత్ర పోషించగా, అమన్‌జోత్ కౌర్ (15 నాటౌట్) జెమీమాకు తోడుగా నిలిచి.. మరో 9 బంతులు మిగిలి ఉండగానే భార‌త్ ను విజ‌య తీరాల‌కు చేర్చింది. ఫలితంగా భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఆదివారం (నవంబర్ 2న) జర‌గ‌నున్న‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న టీమ్‌ ఇండియా, తొలి ప్రపంచకప్‌ ట్రోఫీ కలకు మరింత చేరువైంది.

Leave a Reply