ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది…

  • అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

సోమాజిగూడ, (ఆంధ్రప్రభ): సోమాజిగూడలోని మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బీజేపీ గెలవలేదు. కానీ ఇప్పుడు ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

2024 ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచినా, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో నిలిచిందని, బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితమైందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికల్లో త్రికోణ పోటీ నెలకొన్నదని తెలిపారు.

వివిధ సర్వేలు జరుగుతున్నా అవి నమ్మదగినవి కావని, ఓటర్లలో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. అయితే ప్రజల్లో బీజేపీ పట్ల గట్టి విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి లోపాలను తీవ్రంగా విమర్శించిన కిషన్ రెడ్డి, బోరబండ, రహమత్‌నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, షేక్‌పేట్ ప్రాంతాల్లో పౌరసదుపాయాలు గ్రామపంచాయతీ స్థాయిలో కూడా లేవని అన్నారు.

డ్రైనేజీ, తాగునీరు, వీధి లైట్లు వంటి ప్రాథమిక సమస్యలే పరిష్కారం కాలేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరమని ప్రచారం చేసినా, వాస్తవ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కొన్ని రోడ్లు వేసి, వాటిపై రంగులు వేసి, కొన్ని ఫ్లైఓవర్లు కట్టినంత మాత్రాన ఇది ఇంటర్నేషనల్ సిటీ అవ్వ‌దు అన్నారు.

గతంలో GHMC వద్ద మిగులు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు లైట్లు వేయడానికి కూడా డబ్బులు లేవు. మా పార్టీ కార్పొరేటర్లు పెద్దఎత్తున ఆందోళనలు చేసిన తర్వాతే అధికారులు కేవలం 50 లైట్లు ఇస్తామని చెబుతున్నారు. ఇది నగర పాలన స్థాయి ఎక్కడికి చేరిందో చూపిస్తోంది అని న్నారు.

హామీలను అట‌కెక్కించారు…

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ… డిసెంబర్ 2024లోపల ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఎక్కడ? ప్రతి అమ్మాయికి తులం బంగారం, రూ.2,500 మహిళా సాయం, నిరుద్యోగులకు రూ.4,000 భృతి… ఇవన్నీ మాటలకే పరిమితం అయ్యాయి అన్నారు.

అలాగే, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, ఉన్న వాటిని పెంచలేదు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు. దళితులకు రూ.12 లక్షల సహాయం, బీసీలకు రూ.1 లక్ష కోట్లు అని ప్రకటించినా అమలు లేదు అని విమర్శించారు.

సన్న బియ్యం పథకం కేంద్ర పథకమే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ…. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోతే సన్న బియ్యం ఆగిపోతుందని బెదిరించడం అసత్యం అని అన్నారు కిష‌న్ రెడ్డి. ప్రతి కేజీకి రూ.42 కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం కేవలం రూ.15 మాత్రమే ఇస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఇది రాష్ట్ర పథకం కాదు ప్రధానమంత్రి మోదీ పేదల పథకం అని చెప్పారు. దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లబ్ధి పొందుతున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ధాన్య పథకం అని వివరించారు.

హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం భారీ ప్రాజెక్టులు

కేంద్రం హైదరాబాద్ అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) రూ.15,627 కోట్లతో DPR సిద్ధమై, కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం సిద్ధంగా ఉందని వివరించారు. అలాగే, అంబర్‌పేట ఫ్లైఓవర్ రూ.410 కోట్లు, ఉన్నల్ ఎలివేటెడ్ కారిడార్ రూ.627 కోట్లు, ఆరంఘర్ 6-లైన్ రోడ్ రూ.387 కోట్లు, కూకట్‌పల్లి–బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ రూ.136 కోట్లతో నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.

రైల్వే ఆధునికీకరణ కింద సికింద్రాబాద్, చార్లపల్లి, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, బేగంపేట స్టేషన్ల అభివృద్ధి వేల కోట్ల రూపాయలతో జరుగుతోందని తెలిపారు. MMTS ఫేజ్-2 పనులు పూర్తయ్యాయని, యాదాద్రి వరకు సేవలు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు.

ఆరోగ్యరంగంలో AIIMS బీబీనగర్ రూ.1,366 కోట్లతో నిర్మాణం జరుగుతోందని వివరించారు. IIRFM, NIPER, CARO, NCDC, ICMR సెంటర్‌లు, ఖేలో ఇండియా స్పోర్ట్స్ ఫెసిలిటీలు, నేషనల్ మ్యూజియంలు కేంద్రం అందించిన ప్రాజెక్టులని వివరించారు.

హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం ఎంత కృషి చేస్తుందో, అంతే నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం చూపుతోంది. GHMC, వాటర్ బోర్డ్ సంస్థలు నిధుల కొరతతో పనిచేయలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నగరానికి అభివృద్ధి తెచ్చేది ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ 11 సంవత్సరాలు పాలించి జూబ్లీహిల్స్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తోందని విమర్శించారు. ఈ ఉపఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి, హైదరాబాద్ భవిష్యత్తు కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలి అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply