ఆ ప్రయాణమే ఆయనకు చివరిదైంది

ఆ ప్రయాణమే ఆయనకు చివరిదైంది

( ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ) కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో ఒంగోలు వాసి శేషగిరిరావు మరణించారు. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మృతి చెందిన వారిలో ఒంగోలు కమ్మకపాలెం కు చెందిన బొంత అది శేషగిరిరావు (48) కూడా ఉన్నారు. కృష్ణమూర్తి గత ఇరువై ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడి కుటుంబంతో జీవిస్తున్నారు. హైదరాబాదు అత్తాపూర్‌లో నివసిస్తూ, ఐఓసీఎల్ కంపెనీలో మేనేజర్‌గా పని చేసిన ఆయన బెంగళూరుకు బదిలీ అయ్యారు.

విధుల్లో చేరేందుకు హైదరాబాదు నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బెంగళూరుకు బయలుదేరారు. ఆ ప్రయాణమే ఆయనకు చివరిదైంది. గురువారం రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌ నుండి బయలుదేరిన బస్సు, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చిన్నటేకూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్‌ బస్సు కిందకి చొచ్చుకెళ్లి ఇంధనం లీక్‌ కావడం, ఆ వెంటనే రాపిడి వల్ల మంటలు వ్యాపించడం వలన బస్సు దగ్ధమైంది. శేషగిరిరావు మృతదేహానికి హైదరాబాదులోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Leave a Reply