TG | ప్రజల హక్కులను తాకట్టు పెట్టం : రేవంత్ రెడ్డి

  • కృష్ణా జలాలపై ప్రజెంటేషన్‌..
  • హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్రం తన హక్కులను ఏ పరిస్థితుల్లోనూ తాకట్టు పెట్టదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు (బుధవారం) మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌లో కృష్ణా జలాల వినియోగం, కేటాయింపులు, భవిష్యత్ అవసరాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి సీఎం హాజరై కీలక దిశానిర్దేశం ఇచ్చారు.

ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, నిపుణులు ప్రెజెంటేషన్ ఇవ్వగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజెంటేషన్‌లో కృష్ణా జలాల లభ్యత, వినియోగం, ఆంధ్రప్రదేశ్‌తో ఉన్న జల వివాదాలు, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పురోగతి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పరిణామాలు, మేడిగడ్డ వద్ద తలెత్తిన సమస్యలు వంటి అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమగ్రంగా వివరించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల ఏర్పడే ప్రమాదకర పరిస్థితులను కూడా ప్రస్తావించారు.

ప్రజల హక్కులను కాపాడుతాం

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టం. ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి పోరాడుతాం. ప్రజలు ఒక విశ్వాసం, నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారు. ఈ హక్కుల విషయంలో దేవుడే ఎదురుగా వచ్చినా ఎదురించి ప్రజలకు అండగా నిలబడుతాం,” అని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రానికి, సంబంధిత సంస్థలకు తెలంగాణ హక్కులపై వాదనలు వినిపిస్తూనే, అవసరమైతే న్యాయస్థానాల్లోనూ పోరాడతామన్నారు. నీటి వాటాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని వివరించారు. హైదరాబాద్ నగరానికి ఉమ్మడి కోటా కింద నీటి వాటా కూడా కోరినట్లయితే పరిస్థితి భిన్నంగా ఉండేదని, రాష్ట్ర విభజన తర్వాత పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లే అన్యాయం జరిగిందని గుర్తుచేశారు.

శాసనసభలో సమగ్ర చర్చ అవసరం

కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలపై శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నదీ జలాల కేటాయింపుల్లో తెలంగాణ హక్కుల కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై పాలసీ డాక్యుమెంట్‌ను సభ ముందు అందజేస్తామని చెప్పారు. వరద జలాలను వినియోగిస్తామన్న ఆంధ్రప్రదేశ్ వాదనను తోసిపుచ్చుతూ, ముందుగా నికర జలాల్లో వాటా నిర్ణయించి, తర్వాత వరద జలాల కేటాయింపు జరగాలని సీఎం పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసంపూర్తిగా ఉన్న కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ఎలా అన్యాయానికి గురైందో ఆయన వివరించారు. గోదావరి నది ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రాంతం, అంచనాలు, పేరు మారుస్తూ చేపట్టిన నిర్ణయాలతో ఆయకట్ట ప్రభావితమై నష్టం జరిగిందని గుర్తు చేశారు.

ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాం

ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం 54 లక్షల ఎకరాలకు నీరిస్తే, ఎకరాకు 93 వేల రూపాయలు ఖర్చయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 15 లక్షల ఎకరాలకు నీరు ఇస్తే, ఎకరాకు 11.47 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయాన్ని ప్రజలకు వాస్తవంగా వివరించడం ప్రభుత్వ ధర్మం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. నీటి వాటాలకు సంబంధించిన అంశాలపై జరిగిన, జరుగుతున్న పరిణామాలపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఈ సమగ్ర నివేదిక అందించినందుకు ముఖ్యమంత్రి అభినందించారు.

Leave a Reply