- మరో రెండు రోజుల పాటు వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్ : సాయంత్రం వేళ కురిసిన కుండపోత వర్షానికి నగరం అతలాకుతలమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోగా.., భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాఠశాలలు ముగిసే సమయాలు, ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వేళల్లో భారీ వర్షం కారణంగా రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, HYDRAA అధికారులు తక్షణమే రంగంలోకి దిగి నిర్ధిష్ట ప్రాంతాల్లో రూట్ డైవర్షన్లు అమలు చేసి, ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేయడానికి చర్యలు చేపట్టారు.
కాగా, ఈరోజు శుక్రవారం సాయంత్రం వరకు కూకట్‌పల్లి, బేగంపేట, కాప్రా వంటి కీలక ప్రాంతాలలో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, మలక్‌పేట, సికింద్రాబాద్‌లలో కూడా భారీ వర్షం కురిసింది. దీని ఫలితంగా ప్రధాన రోడ్లు జలమయం అయ్యాయి.
హైదరాబాద్‌లో మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. జూలై 19 నుండి 22 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. రేపు (జూలై 19న) హైదరాబాద్ తోపాటు 10 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం అందని, సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ సూచనలను జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.

