హైదరాబాద్, ఆంధ్రప్రభ : తమ న్యూస్ ఆఫీస్‌పై దాడి, తనపై హత్యాయత్నం చేస్తారా? ఇక తేల్చుకుందాం అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం తన న్యూస్ చానల్ ఆఫీసు వద్ద విలేకరులతో మాట్లాడారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. ఇలాంటి దాడులకు మల్లన్న భయపడుతాడు అనుకుంటే అది మీ భ్రమే అవుతుందని విమర్శించారు.
మా గన్‌మెన్ వద్ద తుపాకీ లాక్కొని… ‘మా గన్‌మెన్ వద్ద నున్న తుపాకీ లాక్కొని మరీ మా సిబ్బందిపై దాడి చేశారని మల్లన్న చెప్పారు. తనతో సహా పలువురికి గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబం తమపై హత్యాయత్నానికి పాల్పడిందని, ఇక తాము ఊరుకోమని అన్నారు.
మీరో, తామో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నానని, తానేం తప్పు మాట్లాడానో ప్రజలు నిర్ణయిస్తారని, రౌడీల్లా తమపై దాడి చేయడమే కాకుండా.. మళ్లీ తన మీదే కేసు పెట్టారని అన్నారు. తన ఆఫీస్‌లో తన రక్తం కళ్లజూశారన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని, ఈ దాడి ఘటనపై ఇప్పటికే ఫిర్యాదు చేశామన్నారు.