చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. గతంలో మరమ్మతులు చేసిన చోటే మళ్లీ పెచ్చులు ఊడి కిందపడ్డాయి.. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న చార్మినార్ నుంచి పెచ్చులు పడటంతో పర్యాటకులు పరుగులు తీశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. పరిస్థితిని సమీక్షించారు.
ఊడిపోయిన పెచ్చులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది శుభ్రం చేశారు. చార్మినార్‌కు మరోమారు మరమ్మతులు చేస్తామని అధికారులు వెల్లడించారు.
కాగా, హైదరాబాద్‌లో ఇవాళ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. పంజాగుట్ట-ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు.