TG | రాష్ట్రాలకు మూటలు మోసిందే మీరే – బిఆర్ఎస్ కు సీతక్క కౌంటర్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఇతర రాష్ట్రాలకు మూటలు మోసింది కేటీఆర్ అని, కేసీఆర్ మూటలు తీసుకున్న వారంతా ఆగం అయ్యారని మంత్రి సీత‌క్క ఆరోపించారు. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడడం మిలినీయం జోక్ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మోయలేనంత అప్పుల కుప్పగా మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. బీఆర్ఎస్ బడ్జెట్ అంతా కోతల బ‌డ్జెట్ అని, అందుకే ప్ర‌జ‌లు వాత‌లు పెట్టార‌ని అన్నారు. ఇది బీఆర్ఎస్ మాదిరి అహో ఓహో భజన బడ్జెట్ కాదన్నారు. మహిళా, రైతు, యువత, అట్టడుగు వర్గాల సంక్షేమ బడ్జెట్ ఇదన్నారు. 100% ఇది వాస్తవిక బడ్జెట్ అని, వాస్తవాలను ప్రతిబింబించే విధంగా బడ్జెట్ ఉందన్నారు.

సాంఘీక సంక్షేమ శాఖ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కి అధిక నిధులు కేటాయించామన్నారు. గుంట భూమి లేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. మహిళా శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ నిధుల కేటాయింపు జరిగిందన్నారు. ఆర్థిక ఒత్తిడిలో ఉన్నా ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యతనిచ్చామని వెల్లడించారు. ఆర్థిక అవకాశాలు, ప్రజల వసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర బడ్జెట్ ఇదన్నారు. 100% మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన బడ్జెట్ అని, ఇందిరా మహిళా శక్తి పథకాన్ని మరింత బలోపేతం చేసే దిశలో, మహిళలకు మరిన్ని వ్యాపార అవకాశాలు కల్పించేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. సమగ్ర అభివృద్ధి, సామాన్యుల సంక్షేమం, సామాజిక న్యాయానికి అద్దం పట్టేలా తెలంగాణ బడ్జెట్ ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *