TG | ఇసుక అక్ర‌మ రవాణాపై ఉక్కుపాదం … అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం

పేద‌ల‌కు ఉచితంగా ఇసుక అందాలి
దారి మ‌ళ్లితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి
నిరంత‌రం ఇసుక రిచ్‌ల‌ను త‌నిఖీ చేయండి
ఇసుక రవాణాపై ఉన్న‌తాధికారుల‌తో రేవంత్ స‌మీక్ష‌

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇక మీదట ఎవరైనా రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. హైద‌రాబాద్ లోని క‌మాండ్ కంట్రోల్ రూమ్ ఆయ‌న నేడు ఇసుక ర‌వాణాపై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా అధికారుల‌తో మాట్లాడుతూ, పేద‌ల‌కు అందాల్సిన ఇసుక ఆక్ర‌మమార్గం ప‌డితే స‌హించేది లేద‌ని తేల్చి చెప్పారు..

నిరంత‌రం త‌నిఖీలు చేయండి
ఇసుక రీచ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశలిచ్చారు.. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండికొట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి జిల్లాల్లో ప్రత్యేకంగా ఇసుక రవాణాపై స్పెషల్ మానిటరింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు ఉచితంగా…
ఇదిలా ఉండగా.. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందిస్తుండగా ఖర్చును తగ్గించేందుకు గాను ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరాపై సర్కార్ దృష్టి పెట్టింది. ఈ మేరకు నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇసుక సరఫరాకు ఎటువంటి కొరత రానివ్వకుండా ఏం చేస్తే బాగుంటుందో సూచించడానికి ఈ కమిటీ అడ్వైజ్ ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను స్థానిక వాగుల నుంచి అందిచాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఖర్చు తక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉచిత ఇసుక రవాణ‌పై రేవంత్ అధికారుల‌కు దిశ నిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *