హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తెలంగాణ సీఎంవో కార్యాలయం ద్వారా ఒక సందేశం విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే అదే మనలను కాపాడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవ ప్రధానాంశమైన ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణకు కట్టుబడి ఉందామని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించే ప్రతిజ్ఞ తీసుకుందామని పిలుపునిచ్చారు. సహజ వనరుల సంపదను రాబోయే తరాలకు అందించాలన్నదే ప్రజా ప్రభుత్వ ధృక్పథమని పేర్కొన్నారు.
ప్రతిజ్ఞ చేయాలి
చెట్లను పెంచి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి.. మన ఆరోగ్యమే కాదు, మన భవిష్యత్ తరాల సంపూర్ణ ఆరోగ్యానికి పునాదులు వేద్దాం.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం.. అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాగా, వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో కొత్తగా చెట్లు నాటే వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున వన మహోత్సవం చేపట్టబోతున్నారు.