- పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది. అదే సమయంలో రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది.
రేపు గురువారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది.
శుక్రవారం రోజున భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో పాటు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.