హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఆదివాసీలకు శుభవార్తను అందించింది. ‘కొమురంభీమ్ కన్జర్వేషన్ కారిడార్’ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో 49ని ప్రభుత్వం నిలుపుదల చేసింది. జీవో 49పై స్థానిక ఆదివాసీలలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని జీవోను నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జీవోను నిలిపివేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, తుడుం దెబ్బ ఆదివాసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, వారి ఆందోళనలను నివృత్తి చేసే వరకు జీవో అమలును నిలిపి ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.జీవో 49 ద్వారా కొమురంభీమ్ ఆసిఫాబాద్‌లో 3 లక్షల ఎకరాల అటవీ భూమిని కన్జర్వేషన్ ఫారెస్ట్ కారిడార్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, కన్జర్వేషన్ కారిడార్ వల్ల తమ జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది!