ఆర్టీసీ డిపోల్లో రేపు సంబురాలు
ఇప్పటి వరకు 200 కోట్ల మంది ఉచిత ప్రయాణం
వాటి విలువ ₹6700 కోట్లు
ప్రతి మహిళకు ఉచిత ప్రయాణంతో నెలకు నాలుగైదు వేలు ఆదా
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
మహాలక్ష్మి పథకం మరో మైలు రాయి దాటిందని, ఈ పథకం ద్వారా రెండు వందల కోట్లు మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, దీన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్‌ల్లో సంబురాలు నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలనలో అమలు చేసిన మొట్టమొదటి పథకం మహా లక్ష్మి పథకం అని, ఈ పథకం 9 డిసెంబర్ 2023 నుండి విజయవంతంగా అమలవుతుందన్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వీటి విలువ రూ. 6700 కోట్లు అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రీయింబర్స్‌మెంట్ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తోందన్నారు.
పథకం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
ఆర్టీసీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త బస్సులను కొనుగోలు చేస్తూ మహాలక్ష్మి పథకం విజయవంతం కోసం కృషి చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు , కండక్టర్ లు, శ్రామిక్ లు, ఇతర సిబ్బంది అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత , ఉద్యోగుల సంక్షేమం ప్రథమ కర్తవ్యంగా ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని, దూరపు ప్రాంత ప్రజలు కూడా నిత్యం నగరానికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఆర్టీసీ వృద్ధి సాధించడం అభినందనీయమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రతి మహిళా నెలకు 4-5 వేల రూపాయల వరకు ఉచిత ప్రయాణం ద్వారా ఆదా చేసుకుంటున్నారు.
Apache AH 64 | భారత వైమానిక దళంలో అత్యాధునిక ఆపాచీ హెలికాప్టర్లు
సంబురాలు ఘనంగా నిర్వహించాలి
రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు, 341 బస్ స్టేషన్ లలో సంబురాలు ఘనంగా నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం అన్నారు. బస్ స్టేషన్లు, డిపోలు మొదలైన వాటిలో బ్యానర్లు ప్రదర్శించాలని సూచించారు. ఈ సంబరాల కార్యక్రమాల్లో ఎంపీలు/మంత్రులు/ఎమ్మెల్యేలు/మేయర్లు/వీఐపీలను ఆహ్వానించాలన్నారు. కార్యక్రమంలో మహిళా ప్రయాణీకులు, కూరగాయల విక్రేతలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వ్యాపార మహిళలు, యాత్రికులను భాగస్వామ్యం చేసి ఉత్తమంగా ప్రసగించేవారికి బహుమతితో సత్కరించాలన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై విద్యార్థులకు వ్యాస రచన, రంగోలి, చిత్రలేఖనం నిర్వహించి బహుమతులను అందజేయాలన్నారు .ఈ పథకం విజయవంతానికి దోహదపడిన ప్రతి డిపోలోని ఐదుగురు ఉత్తమ డ్రైవర్లు , ఐదుగురు ఉత్తమ కండక్టర్లతో పాటు ట్రాఫిక్ గైడ్‌లు, భద్రతా సిబ్బందిని సత్కరించాలన్నారు.

