TG | అన్ని గుర్తు పెట్టుకుంటా… తన పేరుతో ఉన్న టీ స్టాల్ మూయించడంపై కెటిఆర్ ఆగ్రహం
హైదరాబాద్, ఆంధ్రప్రభ – తన ఫొటో, పేరు పెట్టుకున్నారని సిరిసిల్లలో ఓ టీ స్టాల్ మూసివేయించిన ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నానని.. ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇదే మాట మీద ఉంటానని మీకు మాట ఇస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు టీ షాపు యజమాని బత్తుల శ్రీనివాస్ ఆవేదనతో మాట్లాడుతున్న ఒక వీడియోను షేర్ చేశారు.
ఇది ఇలా ఉంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ బతుకమ్మ ఘాట్ వద్ద గత నాలుగేళ్లుగా ‘కేటీఆర్ టీ స్టాల్’ నడిపిస్తున్నాడు. హోటల్ బోర్డుపై కూడా కేటీఆర్ ఫొటో పెట్టుకున్నారు. ఇది గమనించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆ హోటల్‌ను మూసేయించారు. అసలు ఆ టీ స్టాల్‌కు ట్రేడ్ లైసెన్స్ ఉందా? లేకుంటే హోటల్‌ను సీజ్ చేయండి అంటూ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ హుకుంతో వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది టీ స్టాల్‌ను బలవంతంగా మూసివేయించారు.
తన టీ స్టాల్‌ను సీజ్ చేయడంపై బత్తుల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేదన్న కారణంతోనే టీ స్టాల్ మూసివేశామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారని.. కానీ అసలు కారణం అది కాదని తెలిపాడు. కేటీఆర్ ఫొటో తీసేయాలన్న ఆదేశాలు వినకపోవడంతోనే కలెక్టర్ అలా కక్ష కట్టాడని చెబుతున్నాడు. టీ స్టాల్ పోయినా సరే.. నా అన్న కేటీఆర్ ఫొటో తీయనని స్పష్టం చేయడంతోనే ఇలా హోటల్ సీజ్ చేశారని ఆరోపించాడు.
అబద్దాల రేవంత్ కు రూ.4.20 లక్షల కోట్లు జరిమానా…
కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సెటైర్లు కురిపించారు. సింగపూర్ పార్లమెంట్‌లో రెండు అబద్ధాలు చెప్పిన ఎంపీకి 14వేల డాలర్ల జరిమానా విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పార్లమెంటరీ కమిటీ ముందు అబద్ధాలు చెప్పినందుకు భారత సంతతికి చెందిన సింగపూర్ ఎంపీ ప్రీతమ్ సింగ్ (48)కి అక్కడి కోర్టు జరిమానా విధించింది. ఒక్కో అబద్దానికి రూ.7వేల సింగపూర్ డాలర్ల చొప్పున.. రెండు అబద్ధాలకు 14వేల సింగపూర్ డాలర్లను కట్టాలని ఆదేశించింది. మరి కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పుల గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి, నాలుగు వేల పింఛన్లు అని, మహిళలకు రూ.2500 అని.. ఇలా 420 అబద్ధాలు చెప్పిన ముసలి నక్క కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి4.20 లక్ష కోట్ల జరిమానా వేసిన తప్పులేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కెటిఆర్ ట్విట్ చేశారు..