TG | రిజ‌ర్వేష‌న్ లు లేక‌పోవ‌డంతో మ‌హిళ‌ల‌కు తీర‌ని న‌ష్టం: ఎమ్మ‌ల్సీ క‌విత ధ్వ‌జం

ద‌శాబ్దాలు గ‌డుస్తున్నా లోక్ స‌భ గ‌డ‌ప దాటిని మ‌హిళా బిల్లు
ఇప్ప‌టికైనా బిల్లును ఆమోదించి అమ‌లు చేయాలి
హామీలు అమ‌లు చేసే వ‌ర‌కు రేవంత్ స‌ర్కార్ ను వెంటాడ‌తాం
తెలంగాణ భ‌వ‌న్ లో మ‌హితా దినోత్స‌వ వేడుక‌లు
కేంద్ర‌, రాష్ట్రాల‌పై ఎమ్మ‌ల్సీ క‌విత ధ్వ‌జం

హైద‌రాబాద్ – మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారని ఆవేద‌న వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ క‌విత‌. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టిన కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని ధ్వ‌జ‌మెత్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద‌ర్బంగా తెలంగాణ భ‌వ‌న్ లో నేడు జ‌రిగిన వేడుకల‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, . మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యాణా వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. త్వరగా జనగణన చేస్తే.. రాబోయే బిహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరింత మంది మహిళలు ఎమ్మెల్యేలవుతారని కవిత పేర్కొన్నారు. అలాగే చ‌ట్ట స‌భ‌ల‌లో మ‌హిళా రిజర్వేష‌న్ బిల్లుకు ఆమోదింప‌జేయాల‌ని కేంద్రాన్ని కోరారు.

ఎన్నిక‌ల‌లో హామీ ఇచ్చిన విధంగా ప్రతీ మహిళకు రూ.2500 ఇచ్చే వ‌ర‌కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చ‌రించారు. మరోవైపు.. మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలని అన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచకపోవడం సరికాదని తెలిపారు. మహిళలను ఎలా కోటీశ్వరులను చేస్తారో నిర్దిష్టమైన ప్రణాళికను ప్రభుత్వం బహిర్గతం చేయాలని కవిత కోరారు.

బిఆర్ఎస్ ప్ర‌భుత్వంలో కేసీఆర్ మహిళా కేంద్రీకృత పాలన చేశారు.. మహిళల కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని కవిత అన్నారు. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా, పురుషల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నార‌ని అంటూ అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాల్సి ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉందన్నారు. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *