TG ఇటు బిజెపి, అటు కాంగ్రెస్ లు అన్యాయ‌మే చేస్తున్నాయి … హ‌రీశ్ రావు

సంగారెడ్డి: తెలంగాణను బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణకు అన్యాయం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును రేవంత్‌ సర్కార్‌ పూర్తిగా పక్కన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలోని న్యాల్‌కల్‌ మండలం రత్నాపూర్‌ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హరీశ్‌రావు సమక్షంలో నేడు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జహీరాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందన్నారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తం సాగు నీటితో సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. బసవేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయడానికి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని వెల్లడించారు. తాగు, సాగు నీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బీఆర్‌ఎస్ ఉన్నపుడు వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ నిర్లక్షం ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు.

ప్రజలకు కాంగ్రెస్ మోసం తెలిసిపోయిందని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం అవుతుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *