- కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
తెలంగాణలో హోంగార్డులకు జీతాలు జాప్యం కావడంపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 16,000 మందికి పైగా హోంగార్డులు వేతనాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
తక్షణ జీతాల విడుదలకు డిమాండ్
హోంగార్డులకు పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, ప్రతి నెలా జీతాలు సమయానికి అందేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి నెలా జీతాలు ఆలస్యమవుతున్నాయని, హోంగార్డులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు లేకపోవడం వల్ల ఇంటి అద్దె, పిల్లల చదువు ఖర్చులు, బ్యాంకు రుణాలు అన్నీ తీర్చలేక పోతున్నారని, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని వివరించారు.
హోం శాఖ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్నా ఆయన ఈ సమస్యపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని హరీష్ రావు నిలదీశారు. ‘‘మాటల్లో కోటలు దాటే సీఎం.. చేతల్లో మాత్రం పని కనిపించటం లేదు,’’ అంటూ ఎద్దేవా చేశారు.
హోంగార్డుల జీతాలు ఇవ్వకుండా, పథకాలకూ కోతలు పెట్టి ప్రభుత్వం ప్రజావ్యతిరేకంగా పనిచేస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాల వల్ల వేతన జీవులు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం నిశ్శబ్ధంగా ఉంటున్నారని విమర్శించారు.