హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర ఎండల వల్ల వచ్చ వడగాల్పులను ‘రాష్ట్ర నిర్దిష్ట విపత్తు’గా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి వడదెబ్బ బారిన పడే బాధితుల కుటుంబాలకు ఉపశమనం కల్పించే ఉద్దేశ్యంతో, పునరావాస సహాయ నిబంధనల ప్రకారం ఎక్స్-గ్రేషియా/సహాయం అందించాలని నిర్ణయించింది.. వడదెబ్బ బాధితులకు రూ. 4 లక్షల పరిహారం చెల్లించనుంది. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్ర ఎండల మధ్య రాష్ట్రంలో ఎంతో మంది పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవుడ్ డోర్ కార్మికుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. వడగాల్పులను వాతావరణ విపత్తుగా ప్రకటించి, ఆర్థికంగా ప్రభావితమైన కార్మికులకు విపత్తు భత్యం అందించనుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
కాగా, ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండనున్న నేపథ్యంలో కీలక ప్రకటన విడుదల చేసింది. 2025లో వడదెబ్బల తీవ్రత పెరగనున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. హీట్‌వేవ్, సన్ స్ట్రోక్‌ను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్ ప్రకటించింది. వడదెబ్బతో చనిపోయిన వారికి ఇక నుంచి ఎస్‌డీఆర్ఎఫ్ కింద అపద్బంధు పేరుతో ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటి ఆపద్బంధు పథకం కింద బాధిత వ్యక్తులకు రూ. 50 వేలు మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఈ పరిహారం భారీగా పెరుగనుంది.