సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారలోకి వచ్చిన తర్వాత కాల్వల భూ సేకరణ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆరోపణలు చేశారు .కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని.. హైదరాబాద్‌లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశాం అంటూ వ్యాఖ్యలు చేశారు .
ఆదివారం చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా హరీష్‌రావు మాట్లాడుతూ..ప్రాజెక్ట్‌లలో నీళ్లు ఉన్న కూడా ఉద్దేశ పూర్వకంగా కావాలనే నీటిని రేవంత్ ప్రభుత్వం విడుదల చేయలేదని చెప్పారు. రైతులు సొంత డబ్బులతో స్వచ్ఛందంగా కాల్వలు తవ్వుకొని నీళ్లు తీసుకుపోతున్నారని అన్నారు. రైతులపై ప్రేమతో పనిచేయాలి కానీ రేవంత్ ప్రభుత్వం పగతో పనిచేస్తుందని ధ్వజమెత్తారు.
భూ సేకరణ కోసం రూ. 20కోట్లు విడుదల చేస్తే.. రైతులకు ఆయకట్టు పెరుగుతుందని హరీష్‌రావు చెప్పారు.కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు అద్భుతమైన ప్రాజెక్ట్ అని తెలిపారు. కాళేశ్వరం వల్లనే తెలంగాణకు కంపెనీలు వస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే నాలుగు ప్రాజెక్ట్‌లు కూలిపోయాయనే దానికి రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజక వర్గంలో 52వేల ఎకరాలకు నీరు అందిస్తున్నామని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం రాద్దాంతం వదిలి భూసేకరణ చేసి పిల్ల కాలువలు తవ్వాలని హరీష్‌రావు కోరారు
‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది. గత ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో భూసేకరణ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నది. ఇవ్వాళ ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి. రంగనాయక సాగర్ లో, కొండపోచమ్మ, మిడ్ మానేరు లో నీళ్ళు ఉన్నాయి. కక్షపూరితంగానే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరం భూ సేకరణ చేయడం లేదు.కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి సిస్టం అంత రెడీ చేశారు.
పంపు హౌస్‌లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. కేవలం భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది ఉంది. కానీ, ఈ సంవత్సరం కాలంలో ఒక్క ఎకరా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూసేకరణ చేయలేదు. చేయకపోవడం వల్ల చాలా చోట్ల కూడా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకున్న సందర్భం ఉన్నది.కొండెంగులకుంట, బిక్కబండ రైతులు అందరూ వస్తే.. స్వంత డబ్బులతో మిషన్లు పెట్టి.. స్వంత డబ్బులు పెట్టీ, భూ సేకరణలో నష్ట పోతున్న వారికి డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వి నీళ్లు అందిస్తున్నాం.
ప్రభుత్వం పనిచేయట్లేదు. ప్రేమతో పని చేయాలి కానీ కక్షతో పని చేస్తున్నది. నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడాను. పిల్ల కాలువలు తవ్వితే రైతులకు ఆయకట్టు పెరుగుతుంది. కనీసం 15, 20 కోట్లు భూసేకరణకు విడుదల చేయండి అని కోరాను..
అసెంబ్లీలో కూడా కట్ మోషన్ ఇచ్చి నిరసన తెలపడం జరిగింది. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని. కోకాకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం నీళ్లు ఉండబట్టి వచ్చింది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కుంగిన ఒకటో రెండో పిల్లర్లను మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్న.
కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలోని పెద్దవాగు, సుంకిశాల, SLBC సొరంగం, వట్టెం ప్రాజెక్టులు కూలిపోయాయి. కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు. కాళేశ్వరం ద్వారా సిద్ధిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. ఇది కేసీఆర్ చేసిన పుణ్యం. హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు. సిద్ధిపేట ఒక్కటే కాదు ఎన్నో నియోజకవర్గాలకు నీళ్ళు అందుతున్నాయి. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపి భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
https://twitter.com/HarishRaoOffice/status/1908764432299155597?t=jplQrSLPurbSvHanyB2vFA&s=19