హైదరాబాద్ – విదేశీ విద్యా పథకం కింద 1913 మంది విద్యార్థులు చదువుతున్నారని ఈ పథకానికి గత బకాయిలతో కలిసి రూ. 167 కోట్లు చెల్లించామని మంత్రి సీతక్క చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 210 మంది ఎస్సీలు, 100 మంది ఎస్టీలు, 300 మంది బీసీ, 500 మంది మైనార్టీ విద్యార్థులు ఎంపిక అయ్యారని వెల్లడించారు. విదేశీ విద్యా పథకం కింద మొత్తం 1,110 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన సీతక్క.. విదేశీ విద్యా పథకాన్ని రాజకీయం చేయాలనేది బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ తపన అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ బకాయిలు రూ. 4332 కోట్లు ఉన్నాయన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలు 212 శాతం పెంచామన్నారు. విద్యార్థుల దేశ మానవ వనరులు అని అందుకే మా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. కలుషిత ఆహారంపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్టల్స్ బస చేస్తున్నారని చెప్పారు. మంచి విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నామని ఇందుకోసం నాలుగు నెలల కాలంలోనే రూ.499 కోట్లకుపైగా ఖర్చు చేశామన్నారు.
ఆ విషయం తొక్కిపెట్టారు… రాజకీయం చేయొద్దు!
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయిందని బీఆర్ఎస్ సభ్యుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 83 మంది గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఫుడ్ పాయిజనింగ్ , పాము కాట్లతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టి తీసుకొచ్చారు. దుబ్బాక నియోకవర్గంలోని బీసీ హాస్టల్‌లో ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపారు. రెండు రోజుల నుంచి ఆ విద్యార్థి కోమాలోనే ఉన్నాడని పేర్కొన్నారు. ఈ వార్త ఎక్కడా బయటకు రాకుండా ప్రభుత్వం తొక్కిపెట్టిందని ప్రభాకర్ రెడ్డి సభలో ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఆ విషయంపై రాజకీయం చేయొద్దు.. మంత్రి సీతక్క
విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. అది ప్రభుత్వానికి ఆపాదించొద్దని మండిపడ్డారు. ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థికి నీలోఫర్ ఆసుపత్రి లో వైద్యులు చికిత్స అందజేస్తున్నారని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో మొత్తం 114 మంది గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని.. ఆ విషయంలో బీఆర్ఎస్ పెద్దలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విద్యార్థి ఆత్మహత్యకు తొక్కి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనే లేదని అన్నారు. దుబ్బాక హాస్టల్ విద్యార్థి ఘటనలో నివేదికను తెప్పించుకుని సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.