TG | మంచిర్యాల మున్సిపల్ కురుక్షేత్రం..

TG | మంచిర్యాల మున్సిపల్ కురుక్షేత్రం..

  • టికెట్ల కోసం ‘హస్తం’ ఆశావాహుల్లో మొదలైన టెన్షన్

TG | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో మంచిర్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈసారి ఎన్నికలు కేవలం పట్టణ పాలన కోసం మాత్రమే కాకుండా, జిల్లాలో పట్టున్న అగ్ర నాయకుల ప్రతిష్టకు సవాలుగా మారాయి. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, అటు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తమతమ నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం దరఖాస్తుల వెల్లువ కనిపిస్తోంది. ప్రతి వార్డు నుంచి మూడు నుంచి నాలుగు దరఖాస్తులు అధిష్టానానికి అందడంతో, ఎవరిని ఎంపిక చేయాలో తెలియక నాయకత్వం తలమునకలవుతోంది.

రేపటి నుంచే నామినేషన్ల పర్వం.. ఆశావహుల్లో వణుకు!

రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం బుధవారం (జనవరి 28) నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బి-ఫారాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠ నెలకొంది. మంత్రి గడ్డం వివేక్ మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్-ఛార్జిగా ఉన్నప్పటికీ, తన సొంత నియోజకవర్గమైన చెన్నూర్‌లో పట్టు కోల్పోకుండా జాగ్రత్తపడుతున్నారు. అటు బెల్లంపల్లిలో ఎమ్మెల్యే వినోద్ తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనదైన శైలిలో అభ్యర్థుల ఎంపికను పర్యవేక్షిస్తున్నారు. టికెట్ ఆశించి దరఖాస్తు చేసుకున్న నేతలు “వార్డులో మేము బలంగా ఉన్నాం.. మాకే అవకాశం ఇవ్వాలి” అంటూ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీలు – వార్డుల వారీగా గణాంకాలు:

ఈసారి ఎన్నికల్లో జిల్లాలోని 5 ప్రధాన మున్సిపాలిటీలలో మహిళా ఓటర్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
• మంచిర్యాల కార్పొరేషన్: జిల్లాలోనే అతిపెద్దది. మొత్తం 60 డివిజన్లు. ఓటర్లు: 1,81,778 (పురుషులు: 90,646, మహిళలు: 91,111).
• బెల్లంపల్లి మున్సిపాలిటీ: మొత్తం 34 వార్డులు. ఓటర్లు: 44,575 (పురుషులు: 21,560, మహిళలు: 23,012).
• క్యాతనపల్లి మున్సిపాలిటీ: మొత్తం 22 వార్డులు. ఓటర్లు: 29,785 (పురుషులు: 14,761, మహిళలు: 15,023).
• చెన్నూర్ మున్సిపాలిటీ: మొత్తం 18 వార్డులు. ఓటర్లు: 19,903 (పురుషులు: 9,711, మహిళలు: 10,191).
• లక్సెట్టిపేట మున్సిపాలిటీ: మొత్తం 15 వార్డులు. ఓటర్లు: 18,331 (పురుషులు: 8,765, మహిళలు: 9,565).

త్రిముఖ పోరుకు రంగం సిద్ధం!

అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరును ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ మరియు బీజేపీలు పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ మరియు బెల్లంపల్లిలో ప్రతిపక్షాలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ 15 రోజులు జిల్లా రాజకీయం రసవత్తరంగా మారనుంది. హస్తం పార్టీ అగ్ర నేతలు తమ నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకుంటారా లేదా అన్నది ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply