ప్రతీ గ్రామానికి వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా..

ప్రతీ గ్రామానికి వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా..
ఇబ్బంది ఉన్నా.. గ్యారెంటీల అమలు
ఎన్నికల తర్వాత రాజకీయాలొద్దు..
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జగిత్యాల జిల్లా వెల్గటూర్, ఆంధ్రప్రభ : ప్రతీ గ్రామానికి వస్తానని.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చొరవ తీసుకుంటానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటిలో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత పార్టీలకు తీతంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి వచ్చి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు. వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న 78 మంది లబ్ధిదారులకు రూ. 25.40 లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. అలాగే ముగ్గురు దివ్యాంగులకు మంత్రి స్కూటీలను అందజేశారు.
