TG | అభివృద్ధి పనులకు అడ్డంకులు కల్పిస్తున్నారు…

TG | అభివృద్ధి పనులకు అడ్డంకులు కల్పిస్తున్నారు…
- రాజ్యసభ సభ్యులు డా. కె లక్ష్మణ్
TG | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నాయకులకు దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వాల అనాలోచిత విధానాల వల్ల సంప్రదాయ వృత్తులు దెబ్బతిని గ్రామీణ పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని డా. లక్ష్మణ్ తెలిపారు. వికసిత్ భారత్–గ్యారంటీ రోజ్గార్, ఆజీవిక మిషన్ గ్రామీణ చట్టం–2025 పై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలు, మహిళల సంక్షేమానికి పలు సాంకేతిక ఆధారిత పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. కమ్మరి, కుమ్మరి, నేతగీత, చాకలి, మంగలి వంటి సంప్రదాయ వృత్తులు క్రమంగా కనుమరుగవ్వడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినట్లు పేర్కొన్నారు.
విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల సంప్రదాయ వృత్తుల్లో పనిచేసే కుటుంబాలకు ఉచిత శిక్షణ, ఆధునిక పరికరాలు, రోజుకు రూ.500 భత్యం, రూ.15,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించారని, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ప్రతి ఇంటికి రూ.12 వేల సహాయంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి గ్రామాల్లో పారిశుధ్య సమస్యను గణనీయంగా పరిష్కరించారని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జియో ట్యాగింగ్ ద్వారా పనుల పర్యవేక్షణ జరుగుతూనే, జనధన్ యోజన ద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతున్నాయని వివరించారు. గత 11 సంవత్సరాల్లో రూ.45 లక్షల కోట్లకు పైగా నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు చేరాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారతదేశం లో ఒక మతానికే కొమ్ము కాస్తున్నాడని, కనీసం అందరి ఆరాధ్య మందిరం అయోధ్య రామాలయాన్ని దర్శించుకునేందుకు కూడా భయపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, దోనూరు వీరారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, దూడల బిక్షం, చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షుడు కైరం కొండ అశోక్, కొయ్యలగూడెం గ్రామ సర్పంచ్ కైరం కొండ స్వప్న, గుండ్లబావి సర్పంచ్ నందగిరి వెంకటేష్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, యాస అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
