Terrorist attack | Nigeria | నైజీరియాలో ఉగ్ర దాడి

Terrorist attack | Nigeria | నైజీరియాలో ఉగ్ర దాడి
- మైదుగిరిలో మసిదుపై బాంబుల మోత
- ఏడుగురు మృతి
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నైజీరియాలో ఉగ్రవాదులు ఓ మసీదుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. ఈశాన్య నైజీరియా నగరమైన మైదుగురి (Maiduguri) గాంబోరు మార్కెట్‌లోని రద్దీగా ఉండే మసీదులో నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఉగ్రవాదులు బాంబులతో దాడులు చేశారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా బాంబుల దాడి జరగడంతో అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దాడిగా జిహాదిస్ట్ వ్యతిరేక మిలీషియా నాయకుడు బాబాకురా అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడికి ఇప్పటి వరకూ ఏ సాయుధ గ్రూపులూ బాధ్యత వహించలేదు. పేలుడు ధాటికి మసీదు పూర్తిగా శిథిలమైంది.
నైజీరియాలని ఓ రాష్ట్ర రాజధాని మైదుగురి. ఈ నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకుని తమ కార్యకలపాలు జరుపుతున్నారు. ఈ ప్రాంతం జిహాదిస్టు గ్రూపులు, దాని అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ తిరుగుబాటు చేస్తున్నారు. 2009 నుంచి నైజీరియాలో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా సాగుతున్న ఈ ఉగ్రవాద పోరులో ఇప్పటివరకు సుమారు 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనట్లు అక్కడి అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఎలాంటి దాడులూ జరగకపోవడంతో అక్కడి ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఆ సమయంలో తాజా దాడి ప్రజలను మళ్లీ ఉలిక్కిపాటుకు గురి చేసింది.
