Terrible incident | అన్నదమ్ముల మధ్య గొడవ…

Terrible incident | అన్నదమ్ముల మధ్య గొడవ…
- అన్నను కొడవలితో నరికి దారుణ హత్య…
Terrible incident | మడకశిర, ఆంధ్రప్రభ : సాగునీటి కోసం జరిగిన అన్నదమ్ముల మధ్య వివాదం చివరకు ప్రాణాంతకంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బి. రాయపురం గ్రామంలో ఈ రోజు చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉమ్మడి పొలంలో ఉన్న బోరుబావి నీటి పంపకాల విషయంలో తలెత్తిన గొడవలో తమ్ముడు తన అన్నను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన గ్రామాన్ని శోకసముద్రంలో ముంచింది.
గ్రామానికి చెందిన రాధాకృష్ణ (55) ఈరమాళేగౌడ్ అన్నదమ్ములు. ఉమ్మడి వ్యవసాయ భూమిలో ఉన్న బోరుబావి నీటిని పక్క పొలంలోకి వదలకూడదన్న అంశంపై ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ వివాదం మరింత తీవ్రమై మాటల తూటాలుగా మారింది. మాట మాట పెరిగి కోపంతో ఊగిపోయిన తమ్ముడు ఈరమాళేగౌడ్, తన అన్న రాధాకృష్ణపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ దాడి అత్యంత అమానుషంగా జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాధాకృష్ణ చేతిని వేరుగా నరికి వేయడమే కాకుండా గుండె భాగంలో పదేపదే పొడిచి చంపినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది. తీవ్ర గాయాలపాలైన రాధాకృష్ణ సంఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన గ్రామంలో భయాందోళనలకు కారణమైంది. హత్య అనంతరం నిందితుడు ఈరమాళేగౌడ్ గ్రామంలోకి వెళ్లి తానే అన్నను చంపేశానని చెప్పినట్లు సమాచారం.
దీంతో గ్రామస్తులు పొలానికి వెళ్లి చూడగా రాధాకృష్ణ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటం చూసి భీతిల్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రాధాకృష్ణ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబాన్ని పోషిస్తున్న పెద్ద దిక్కు కోల్పోవడంతో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు ఈరమాళేగౌడ్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. సాగునీటి సమస్యలు, భూ వివాదాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘోరాలకు దారి తీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో బి. రాయపురం గ్రామం మొత్తం విషాద ఛాయల్లో మునిగి పోయింది.
