AP | చెరువులో పడి టెన్త్ విద్యార్థి మృతి

వట్టిచెరుకూరు, మార్చి 27 (ఆంధ్రప్రభ ): స్నానం చేసేందుకు మంచినీటి చెరువు వద్దకు వెళ్లి కాలు జారి చెరువులో పడి బీసీ హాస్టల్ విద్యార్థి మృతిచెందిన సంఘటన వట్టిచెరుకూరు మండల కేంద్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. హాస్టల్ సంక్షేమ అధికారి టి.సాంబశివరావు, హాస్టల్ విద్యార్థులు తెలిపిన వివరాల మేరకు.. పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం, జొన్నలకుంట గ్రామానికి చెందిన బిచ్చం వెంకటేష్, రమాదేవి దంపతులకు ముగ్గురు సంతానం. వీరు వ్యవసాయ పనులు చేస్తూ, ముగ్గురు కుమారులను చదివించుకుంటూ జీవిస్తున్నారు. శ్రమజీవులైన దంపతులకు మూడవ సంతానం బిచ్చం కిషోర్ (15). గత ఆరు సంవత్సరాల నుండి వట్టిచెరుకూరు మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్లో ఉంటూ, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.

ఇవాళ ఉదయం స్థానిక హాస్టల్లో నీరు రాకపోవడంతో స్నానం చేసేందుకు నీరులేక ముగ్గురు విద్యార్థులు కలిసి దగ్గరలో ఉన్న మంచినీటి చెరువు వద్దకు నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్లారు. ఇరువురు విద్యార్థులు చెరువుగట్టుపై ఉండగా మృతుడు కిషోర్ చెరువు అంచు లోపలకు దిగి నీరు ముంచుతున్న క్రమంలో కాలు జారి చెరువులో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన పైనున్న ఇరువురు విద్యార్థులు దగ్గర లో ఉన్న స్థానికులకు సమాచారం అందించి వారిని తీసుకువచ్చే లోపు విద్యార్థి కిషోర్ అప్పటికే చెరువులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ఈ ఘటనతో హాస్టల్లో విషాదచాయలు అలుముకోవడంతో బిక్కుబిక్కు మంటూ తోటి విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ లో ఏడుగురు విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. మృతిచెందిన కిషోర్ కు ఇద్దరు అన్నయ్యలు ఉన్నట్లు, వారిలో పెద్ద అన్నయ్య శశి గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేయగా, రెండవ అన్నయ్య నరేంద్ర గుంటూరు కెరీర్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంటర్ పూర్తి చేసినట్లు తెలిపారు. చదువులోనూ, ఆటల్లోనూ ఎంతో హుషారుగా ఉండే కుమారుడు మృతిని తట్టుకోలేక ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని, విచారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు మార్చురీకి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *