క్రికెట్ ప్రపంచంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ అంటే క్రీడాభిమానులకు ఫుల్ కిక్కు, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. రెండు జట్ల పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆసియా కప్ టీ20 2025లో భాగంగా నేడు జరగబోయే భారత్-పాక్ పోరు చుట్టూ ఉద్రిక్తత నెలకొంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రతిస్పందనలు వస్తున్నాయి. దేశ గౌరవం ముందు ఎంటర్‌టైన్‌మెంట్‌కు విలువ లేదంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో, కేవలం వినోదం కోసం పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటం సరికాదని పలు సామాజిక సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో మ్యాచ్ రద్దు చేయాలని హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
గతంలో కూడా ఇలాంటి సందర్భాల్లో భారత క్రీడాకారులు తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా, ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో యువరాజ్ సింగ్ పాకిస్తాన్ జట్టుతో ఆడాల్సిన మ్యాచ్‌ను నిలిపివేసిన ఘటన మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. పహల్గాం దాడి అనంతరం యువరాజ్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025లో పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసింది.
ప్రజల మనోభావాలను గౌరవిస్తూ యువరాజ్ సింగ్‌తో పాటు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా వంటి సీనియర్ క్రీడాకారులు పాకిస్తాన్ జట్టుతో ఆడటానికి నిరాకరించారు. ఆటగాళ్ల ఈ నిర్ణయానికి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
మరోవైపు, అభిమానులలో పెద్ద ఎత్తున విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మ్యాచ్ బహిష్కరణ అవసరం లేదని, క్రీడను క్రీడగా చూడాలని సూచిస్తుండగా, మరికొందరు మాత్రం ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఎలాంటి క్రీడా సంబంధాలు కొనసాగించకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ నిరసనల ప్రభావంతో నేడు జరగబోయే భారత్-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది. చివరకు ఆట జరిగేనా? లేక బహిష్కరణకు దారి తీస్తుందా? అన్న ప్రశ్న ఉత్కంఠ రేకెత్తిస్తుంది.

