- హింసాత్మకంగా మారిన రాష్ట్ర హోదా నిరసనలు
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం లేహ్ నగరంలో భారీ నిరసనలు చెలరేగాయి. శాంతియుతంగా మొదలైన ఈ ఆందోళనలు కొద్దిసేపటికే హింసాత్మక రూపం దాల్చాయి. నిరసనకారులు బీజేపీ కార్యాలయానికి, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టగా, కొంతమంది యువకులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. లేహ్ నగరంలో ఇంత స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి అని స్థానికులు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా లేహ్ జిల్లా మేజిస్ట్రేట్ బుధవారం ఐదుగురికి పైగా గుమికూడరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించరాదని నిషేధాజ్ఞలు జారీ చేశారు. లేహ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.
నిరాహారదీక్ష..
లేహ్ ఏపెక్స్ బాడీ (LAB) యువజన విభాగం ఇప్పటికే సెప్టెంబర్ 10 నుంచి 35 రోజుల నిరాహారదీక్షను ప్రారంభించింది. దీక్షలో పాల్గొన్న 15 మందిలో ఇద్దరు ఆస్పత్రిలో చేరడంతో, ఆగ్రహంతో యువజన విభాగం నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో లేహ్ నగరంలో బంద్ పాటించి, వేలాదిమంది ఎన్‌డిఎస్ మెమోరియల్ గ్రౌండ్‌లో సమావేశమై ర్యాలీ నిర్వహించారు.
ఆరో షెడ్యూల్ డిమాండ్
లద్దాఖ్‌కు ఆరో షెడ్యూల్ వర్తింపజేయాలన్న ఉద్యమం చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ షెడ్యూల్ ప్రకారం త్రిపుర, మేఘాలయ, మిజోరం, అసోం రాష్ట్రాల్లో గిరిజన జనాభా కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. పాలన, అధ్యక్షుడు, గవర్నర్ అధికారాలు, స్థానిక సంస్థలు, ప్రత్యామ్నాయ న్యాయవ్యవస్థ, ఆర్థికాధికారాల కోసం స్వయం ప్రతిపత్తి మండళ్లకు అధికారం కల్పిస్తుంది.
కేంద్ర చర్చల ముందు హింస !!
గత నాలుగేళ్లుగా LAB, కర్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) కలిసి రాష్ట్ర హోదా కోసం పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంతో పలు రౌండ్ల చర్చలు జరిపాయి. తాజా రౌండ్ చర్చలు అక్టోబర్ 6న జరగనున్న నేపథ్యంలోనే ఈ హింసాత్మక నిరసనలు చోటుచేసుకోవడం గమనార్హం.