జలదిగ్బంధంలో బాసర ఆలయం

జలదిగ్బంధంలో బాసర ఆలయం
బాసర, ఆంధ్రప్రభ : బాసర(Basara) పుణ్యక్షేత్రం నుంచి ఇంకా వరద నీరు కదల లేదు. నిజాం సాగర్ డ్యాం(Nizam Sagar Dam) బ్యాక్ వాటర్, గోదావరి(Godavari River) నీరు వరద పోటెత్తడంతో బాసర పట్టణం చుట్టూ నీరు ముట్టడించింది. బాసర పుణ్యక్షేత్రం(Basara Temple) జలదిగ్బంధం( Waterlogging)లో చిక్కుకుంది. దీంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు మూడు రోజుల వరకూ నీరు కదలే పరిస్థితి లేదని పట్టణవాసులు(Basara Town), అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిజాం సాగర్ నుంచి లక్ష క్యూసెక్కుల వరకూ నీరు విడుదల అవుతుంది.
రెండు కిలో మీటర్ల మేర వరద నీరు…
బాసర ఆలయం చుట్టూ సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వరద నీరు ఉంది. బాసర క్షేత్రం నుండి రైల్వే స్టేషన్, గోదావరి నదికి వెళ్ళు మార్గాలు రహదారులపై సుమారు రెండు మూడు అడుగుల నీరు నిలిచి ఉంది. రైల్వే స్టేషన్ మార్గంతో పాటు గోదావరి నదికి వెళ్ళు మార్గంలోని లాడ్జిలతోపాటు అపార్టుమెంట్‌లోకి వరద నీరు చేరింది.

ఆయా లాడ్జిలలో అపార్ట్మెంట్లలో ఉన్న వారిని ఎస్డిఆర్ఎఫ్ బృందం సభ్యులు పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శనివారం 36 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకూ బాసర ముంపు ప్రాంతం నుంచి 200 వరకూ ఎస్ఆర్‌డీఎఫ్ బృందం సురక్షిత ప్రాంతలకు తరలించారు. బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్(Avinash Kumar), సీఐ మల్లేష్(Mallesh) తసిల్దార్ పవనచంద్ర(Pawan Chandra), ఎస్సై శ్రీనివాస్(శ్రీనివాస్) ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు.

వేల ఎకరాల నీటి మునక…
గోదావరి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుండడంతో గోదావరి పరివహక ప్రాంతంతో పాటు ఓని, కౌట, కిర్గుల్ బి, కిర్గుల్( కె) సాలాపూర్ , సవర్ గావ్, తదితర గ్రామాల్లో పంట నీట మునిగింది. వేలాది ఎకరాలు ఇంకా నీటి మునిగి ఉన్నాయి. ఇంకా పంట పొలాలు మునిగి ఉండడంతో పంటలు పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
