Telangana| మారింది సీఎం ..పార్టీ మాత్రమే – రేవంత్ సర్కార్ పై కిషన్ రెడ్డి విసుర్లు
ఈ రెండు పార్టీలు దొందు దొందే
కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా?
కేసీఆర్, రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్
420 హామీలను అమలు చేయని రేవంత్‌రెడ్డి
పది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కాంగ్రెస్
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కిషన్‌రెడ్డి విమర్శలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
తెలంగాణలో మారింది కేవలం సీఎం, పార్టీ మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.. అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు.. ఇద్దరు దొందు దొందే అన్నారు.. సంగారెడ్డిలో శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. కేంద్రం ఏం చేసిందంటూ అందరూ మాట్లాడుతున్నారని, కేసీఆర్, రేవంత్ ఇద్దరు కలిసి వస్తే ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అంటున్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్.. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు.
పది నెలల్లోనూ కాంగ్రెస్ వైఫల్యం..
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ వస్తే.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగేలా పదేళ్లు పరిపాలన చేశారు. మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం అయింది. పదేళ్లలో బీఆర్ఎస్‌పై వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్ పార్టీపై పది నెలల్లోనే వ్యతిరేకత పెరిగింది. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్టాన్ని అప్పులకుప్పగా మార్చారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. బీజేపీ మాత్రమే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీ అభ్యర్థులు గేలిస్తే ప్రశ్నించే గొంతుకగా శాసనమండలిలో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ శాసనమండలిని నిర్వీర్యం చేసింది. అసలు శాసనమండలి ఉందా? లేదా? అన్న అనుమానం కలిగేటట్టు బీఆర్ఎస్ వ్యవహరించింది’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.