Telangana – హోలీ వేడుకలలో అపశ్రుతులు – వేర్వేరు ప్రమాదాలలో నలుగురు మృతి

హైద‌ర‌బాద్ – హోలీ పండుగ వేళ వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు బాలురు దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పండుగ వేళ జరిగిన ప్రమాదాలతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

జగిత్యాల జిల్లా రూరల్ మండలం వెల్దుర్తికి చెందిన వ్యాపారి సాగర్ గౌడ్ (30) శుక్రవారం మిత్రులతో కలిసి హోలీ వేడుక జరుపుకున్నారు. అనంతరం ఎస్ఆర్ఎస్పీ డి 64 కాలువలో స్నానానికి దిగి గల్లంతై మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే విధంగా మంచిర్యాల జిల్లా వేమనపల్లికి చెందిన కంపెళ్ల రాజ్ కుమార్ (21) శుక్రవారం బంధువులు, స్నేహితులతో కలిసి హోలీ వేడుక జరుపుకున్న తర్వాత సమీపంలోని ప్రాణహిత నదికి వెళ్లి స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. జాలర్లు అతని మృత దేహాన్ని నది నుంచి వెలికి తీశారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లికి చెందిన మ్యాదరి అనుదీప్ (15) హోలీ సందర్భంగా బైక్‌పై స్నేహితులను కలిసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా, చిన్నకోమటిపల్లి చెరువు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఆదిలాబాద్ పట్టణం కొత్తకుమ్మరివాడకు చెందిన పదో తరగతి విద్యార్ది జిల్లెడ్ వార్ రుషి కుమార్ (16) బాలాజీ‌నగర్‌కు చెందిన తన స్నేహితుడు ప్రేమ్ తో కలిసి హోలీ వేడుకలు జరుపుకునేందుకు వెళ్లాడు. అనంతరం బైక్‌పై తిరిగివస్తూ స్థానిక మైదానం సమీపంలో రహదారిపై అదుపుతప్పి ఇద్దరూ పడిపోయారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, రుషి కుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రేమ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆయా ప్రాంత పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *