ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వానాకాలం(Rainy season), యాసంగి సీజన్ (Yasangi season) ఏదైనా రైతన్నలకు యూరియా (Urea) తిప్పలు తప్పడం లేదు. కొన్ని రోజులుగా తెలంగాణ(Telangana)లో యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. వ్యవసాయ పనులు మానేసి మరీ పీఏసీఎస్(PACS)ల ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడ చూసిన ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే కార్యాలయాల వద్ద బ్యాగులు, ఆధార్ కార్డులు(Aadhaar cards), చెప్పులను క్యూలలో పెట్టి మరీ ఎదురు చూస్తున్నారు.
పొద్దంతా లైన్‌లో నిలబడినా సరిపడా యూరియా అందక రైతులు బోరుమంటున్నారు. ప్రభుత్వం నిబంధనలు (government regulations) విధిస్తూ ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే అందిస్తుండటంతో మండిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (Central and State Governments) సరిపడా యూరియా అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే యూరియా కొరత పొలిటికల్ (Political)టర్న్ తీసుకుంది. దీనిపై అధికార , ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మీ వల్లనే యూరియా కొరత వచ్చిందంటే. .కాదు కాదు… దీనికి కారణం మీరే అంటూ ఆరోపించుకుంటున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మాత్రం తమకు రైతులపై అంటే చిత్త శుద్ది ఉందని, తొందరలోనే యూరియా కొరతను అధిగమనిస్తామని, ప్రతి ఒక్కరైతుకు సరిపడా యూరియాను పంపిణి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంపై చిన్నచూపు చూస్తూ సరిపడా యూరియా పంపించడం లేదని ఆరోపిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనికి మరో విధంగా సమాధానం ఇస్తుంది. తెలంగాణకు రైతులందరికీ సరిపోను యూరియా పంపించామని, కావాలనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రాజకీయం (Politics) చేస్తుందని ఆరోపిస్తుంది. మధ్యలో బీఆర్ఎస్ (BRS) కూడా రైతులకు మద్దతుగా నిలుస్తోంది.
అన్నదాతలకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆ పార్టీ నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు. ఏదేమైనా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు కాపాడుకోవాలంటే యూరియా అవసరం ఎంతైనా ఉంది. రైతుల గోడును పట్టించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను పరిష్కరించాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
సాగు విస్తీర్ణం ఇలా..
తెలంగాణలో ఒక కోటి 32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు అవుతోంది. రాష్ట్ర అవసరాలు తీరాలంటే కనీసం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అని ఒక అంచనా. అయితే ఈ వానాకాలానికి గాను 10 లక్షల 40వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తే సరిపోతుందని ఓ లెక్క గట్టి కేంద్రాన్ని అడిగింది రాష్ట్రం. కేంద్రం తన దగ్గరున్న స్టాక్ ఎంతో చూసుకుని ఈ వర్షాకాలానికి 9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో ఈ ఆగస్ట్ నాటికి 8 లక్షల 30వేల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు రావాల్సి ఉంది. కాని, ఇప్పటి వరకు అందింది మాత్రం 5 లక్షల 32వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే.