Telangana | ఏసీబీకి చిక్కిన వర్క్స్ అకౌంట్స్ సూపరింటెండెంట్

Telangana | ఏసీబీకి చిక్కిన వర్క్స్ అకౌంట్స్ సూపరింటెండెంట్
Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యూపీఐ ద్వారా రూ.14.77 లక్షల లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ఘటన తెలంగాణలోని కరీంనగర్ లో చోటుచేసుకుంది.
ఫైళ్ల స్కృటినీ, ఆమోదం కోసం ఏకంగా డిజిటల్ పేమెంట్స్ రూపంలో లంచం తీసుకున్న ఒక ఉన్నతాధికారి ఏసీబీకి చిక్కారు. కరీంనగర్‌లోని జాయింట్ డైరెక్టర్ వర్క్స్ అకౌంట్స్ (WA) కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఈగల మధుసూదన్ (50)ను తెలంగాణ ఏసీబీ అధికారులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. మధుసూదన్ తన అధికార పరిధిలోని ఫైళ్లను క్లియర్ చేయడానికి, తప్పులను సరిదిద్దడానికి లంచం డిమాండ్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.
అయితే, పట్టుబడకుండా ఉండేందుకు ఆయన ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. భద్రాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లోని ఒక బినామీ ఖాతాను ఉపయోగించి, యూపీఐ (UPI) లావాదేవీల ద్వారా లంచం సొమ్మును వసూలు చేశారు. 2022 సెప్టెంబర్ 15 నుంచి 2023 సెప్టెంబర్ 20 మధ్య కాలంలో సుమారు రూ.14.77 లక్షలను ఈ విధంగా సేకరించినట్లు ఏసీబీ నిర్ధారించింది. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లలోని వ్యత్యాసాలను కప్పిపుచ్చడానికి లేదా అవసరమైన మార్పులు చేయడానికి ఆయన ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే ఈ అక్రమ వసూళ్లలో ఇంకా ఎవరెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
