మాహీకి బీసీసీఐ ఆఫర్..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని బీసీసీఐ రంగంలోకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మాహీని భారత జట్టుకు మెంటార్ గా నియమించాలని చూస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ధోనీకి తెలియజేసినట్టు కూడా సదరు కథనాలు పేర్కొన్నాయి. కెప్టెన్ గా భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత ధోనీది. అతని నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్-2007, వన్డే వరల్డ్ కప్- 2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 విజేతగా నిలిచింది. అలాగే, ఐపీఎల్ లో చెన్నయ్ సూపర్ కింగ్స్ ను ఐదుసార్లు చాంపియన్ గా నిలిపాడు.
2020లో అంతర్జాతీయ క్రికెటు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. వచ్చే ఏడాది ఆడతాడో..? లేదో..? చెప్పలేని పరిస్థితి. ధోనీ అనుభవాన్ని, అతని వ్యూహాలను వాడుకోవాలని బీసీసీఐ భావిస్తుంది. 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో కూడా ధోనీని భారత జట్టుకు మెంటార్గా నియమిం చిన విషయం తెలిసిందే. అప్పుడు కేవలం ఆ ప్రపంచ కప్ కు మాత్రమే అతని సేవలను వాడుకుంది. కానీ, ఇప్పుడు అతని సేవలను సుదీర్ఘంగా వాడుకోవాలని బోర్డు భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ధోనీ మధ్య విభేదాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగు తుంది. మరి, గంభీర్ హెడ్ కోచ్ గా ఉండగా బీసీసీఐ ఆఫర్ ను ధోనీ అంగీకరిస్తాడా..? అన్న చర్చ జరుగుతుంది.

