నీటిని విడుదల చేయండి

టీబీపీ నుంచి ఎల్ఎల్‌సికి నీటిని విడుదల చేయాలని కలెక్టర్‌కు టీడీపీ నాయకుల వినతిపత్రం

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ఇటీవల కురిసిన విపరీతమైన వర్షాల కారణంగా పశ్చిమ ప్రాంత రైతాంగం తీవ్రమైన నష్టాలను చవిచూసింది. ఇప్పటికే కరువుతో నలిగిపోయిన రైతులు తాజా వర్షాల దెబ్బకు పంటలను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రబీ సీజన్‌కు నీటి సరఫరా కోసం తుంగభద్ర ప్రాజెక్ట్‌ (టి.బి.పి.) నుంచి యల్.యల్.సి.కి తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరుతూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తదితరులు కలెక్టర్ డాక్టర్ ఎ. సిరికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వరరెడ్డి, అదోని టిడిపి ఇన్‌ఛార్జి కె. మీనాక్షీనాయుడు తదితర నేతలు మాట్లాడుతూ, “టి.బి.పి.లో ప్రస్తుతం తగినన్ని నీటి నిల్వలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం అందుకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రైతాంగం తీవ్రంగా నష్టపోయిన ఈ సమయంలో తక్షణ నీటి విడుదల ద్వారానే వారికి ఊరటనిస్తుంది” అని అన్నారు. వినతిపత్రంలో, నీటిని విడుదల చేయడానికి కలెక్టర్ మాత్రమే కాకుండా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సంబంధిత నీటిపారుదల అధికారుల దృష్టికి తీసుకెళ్తామని నేతలు తెలిపారు.

వినతిపత్రం అందజేసినవారిలో వెంకటశివప్రసాద్, రమాకాంత్ రెడ్డి, గోవర్దన రెడ్డి, రామకృష్ణారెడ్డి, బావిగడ్డ ఉసేనాసాహెబ్, వెంకటపతిరాజు, అడివప్పగౌడ్, పి.సాయిబాబు, మహేశ్వరెడ్డి, ధర్మారెడ్డి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply