చెన్నై: నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్‌కు తమిళనాడు బీజేపీలో కీలక పదవి లభించింది. ఆమెను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ బీజేపీ తమిళనాడు శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర బీజేపీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో ఎం. చక్రవర్తి, వి.పి. దురైసామి, కె.పి. రామలింగం, కారు నాగరాజన్, శశికళ పుష్ప, కనకసబాపతి, డాల్ఫిన్ శ్రీధర్, ఎ.జి. సంపత్, పాల్ కనగరాజ్, జయప్రకాష్‌లతో పాటు ఖుష్బూ సుందర్, ఎన్. సుందర్ తదితరులు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. మొత్తం 14 మంది ఈ జాబితాలో ఉన్నారు.
అలాగే రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శిగా కేశవ వినాయగన్ నియమితుడయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బాలగణపతి, రామ శ్రీనివాసన్, ఎం. మురుగానందం, కార్త్యాయిని, ఎ.పి. మురుగానందం బాధ్యతలు చేపట్టనున్నారు.
కరాటే త్యాగరాజన్, అమర్ ప్రసాద్ రెడ్డి తదితర 15 మందిని రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. రాష్ట్ర కోశాధికారిగా ఎస్.ఆర్. శేఖర్, రాష్ట్ర యూనిట్ ఆర్గనైజర్‌గా కె.టి. రాఘవన్, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా ఎం. చంద్రన్, రాష్ట్ర ప్రధాన ప్రతినిధిగా నారాయణన్ తిరుపతి ఎంపికయ్యారు.