MLA talasaani | నీతి నిజాయితీకి మారుపేరు యాదవులు

నీతి నిజాయితీకి మారుపేరు యాదవులు

దక్షిణ భారత యాదవ ప్లీనరీలో తలసాని పిలుపు
యాదవులు ఐక్యంగా ఉంటే రాజకీయ వృద్ధి సాధించగలాం
యాదవులకు మహా భారతం అంత చరిత్ర ఉంది
రాష్ట్ర వ్యాప్తంగా సదర్ ఉత్సవాలకు ప్రోత్సాహం
కోకాపేటలో యాదవ భవనానికి 5 ఎకరాల భూమి కేటాయింపు
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

MLA Talasaani | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ః యాదవ జాతి మొత్తం ఐక్యంగా ఉండాలని, అప్పుడే రాజకీయంగా అభివృద్ధి సాధించగలమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లిలోని తెలుగు అకాడమీలో నిర్వహించిన దక్షిణ భారత యాదవ ప్లీనరీకి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మన జాతి పెద్ద సంఖ్యలో ఉందన్నారు తలసాని. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో జనరల్ స్థానాలలో పోటీ చేసి అత్యధిక స్థానాలలో యాదవులే సర్పంచ్ లుగా గెలిచారని చెప్పారు. పార్టీలు ఏవైనా మనమంతా యాదవజాతి అనే విషయాన్ని మరువొద్దన్నారు.


నీతి నిజాయితీకి మారుపేరు యాదవులని, మనం శ్రీ కృష్ణుడు వారసులం అన్నారు. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఎంతో చైతన్యం వచ్చిందని తెలిపారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మొదటగా తెరిచేది మన యాదవుడేనని చెప్పారు. వారినే గొల్ల మిరాసి అంటారని, ఈ వ్యవస్థను తొలగించాలని చూస్తే తాను తీవ్రంగా వ్యతిరేకించానని తెలిపారు. మనకు మహా భారతం అంత చరిత్ర ఉందని అన్నారు. దీపావళి పండుగ తర్వాత యాదవులు నిర్వహించే సదర్ కేవలం హైదరాబాద్ లోని నారాయగూడ, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో మాత్రమే నిర్వహించే వారని, తాను తెలంగాణ ప్రభుత్వం లో మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేలా ప్రోత్సహించామని పేర్కొన్నారు.


బడుగు బలహీన వర్గాలకు చెందిన అన్ని వర్గాలను కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బిసిలు అంతా చైతన్యం కావాలని చెప్పారు. యాదవుల కోసం కేసీఆర్ ప్రభుత్వం కోకాపేట లో 5 ఎకరాల భూమి కేటాయించిందని, ఎకరం 150 కోట్ల రూపాయలు ఆ భూమి విలువ ఉందన్నారు. రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చే యాదవ విద్యార్థుల కోసం అద్భుతమైన భవనాన్ని నిర్మించామని, ప్రారంభానికి సిద్ధంగా ఉందని వివరించారు. యాదవులను ఏకం చేసేందుకు పోరాడుతున్న జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు.


ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, బళ్ళారి నగర మేయర్ గాదెప్ప యాదవ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన యాదవ సంఘం ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply