T20 World Cup 2026 | సఫారీలు థ్రిల్లింగ్ విక్ట‌రీ

T20 World Cup 2026 | సఫారీలు థ్రిల్లింగ్ విక్ట‌రీ

  • 5 పరుగుల తేడాతో ఆఫ్గానిస్థాన్‌పై గెలుపు
  • ప్రధాన మ్యాచ్ టై.. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఉత్కంఠ
  • తొలి సూపర్ ఓవర్ కూడా టై.. రెండో సూపర్ ఓవర్‌లో స‌ఫారీ విజ‌యం

T20 World Cup 2026 | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : టీ20 ప్రపంచ కప్‌ 2026 లో సంచలన విజయం నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయే పోరులో దక్షిణాఫ్రికా అద్భుత విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫలితం కోసం ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. చివరికి, రెండో సూపర్ ఓవర్‌లో 5 పరుగుల తేడాతో గెలిచిన సఫారీ జట్టు ఊపిరి పీల్చుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతి వరకు ఇరు జట్ల ఆటగాళ్లు కనబరిచిన పోరాట పటిమ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది.

సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు సూపర్ ఓవర్లు జరిగాయి. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 187/6 పరుగులు చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్‌ 19.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో అఫ్గాన్ వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా మొదటి ఐదు బంతుల్లో 11/1తో నిలవగా.. చివరి బాల్‌కు స్టబ్స్ సిక్స్ బాదడంతో మరో సూపర్ ఓవర్‌ అనివార్యమైంది.

ఇందులో సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్ రెండు సిక్స్‌లు, ట్రిస్టన్ స్టబ్స్ ఒక సిక్స్ కొట్టడంతో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 19/2కు పరిమితమైంది. మొదటి రెండు బంతుల్లో అఫ్గాన్ పరుగులేమీ చేయకుండానే వికెట్ కోల్పోయింది. తర్వాత రహ్మనుల్లా గుర్బాజ్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. తర్వాత ఒక వైడ్ రావడంతో అఫ్గాన్ విజయ సమీకరణం ఒక బంతికి ఐదు పరుగులుగా మారింది. ఆఖరి బంతికి గుర్బాజ్.. మిల్లర్‌కు క్యాచ్ ఇవ్వడంతో సఫారీలు ఊపిరిపీల్చుకున్నారు.

Leave a Reply