t20 final| ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

t20 final| ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

ఫైనల్ మ్యాచ్‌కు రిజ‌ర్వ్‌డే కేటాయింపు
రెండు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేస్తేనే ఫ‌లితం
ఫైనల్ రద్దయితే రెండు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు

భార‌త్‌, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రిగే ఫైనల్ మ్యాచ్‌కు ఎలాంటి వర్ష సూచన లేదు. అయితే ఒక‌వేళ ఈ మ్యాచ్‌కు ఆటంకం క‌లిగి రద్దయితే ఐసీసీ రూల్స్ ఎలా ఉన్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఫైనల్ జరిగే ఆదివారం(మార్చి 8) వర్షం పడితే.. ఈ ఫైనల్ మ్యాచ్‌కు మార్చి 9(సోమవారం)ని ఐసీసీ రిజర్వ్ డేగా కేటాయించింది. ముందుగా నిర్ణయించిన రోజున కనీస ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే.. మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజు ఫ్రెష్‌గా నిర్వహిస్తారు. ఒకవేళ మొదటి రోజు ఆట ప్రారంభమై మధ్యలో నిలిచిపోతే.. రిజర్వ్ డేన ఎక్కడైతే ఆట ఆగిపోయిందో అక్కడి నుంచే మ్యాచ్ కొనసాగుతుంది. మ్యాచ్‌ను తొలి రోజు పూర్తి చేయడానికి అంపైర్లు ప్రయత్నిస్తారు. ఇందుకోసం షెడ్యూల్ సమయం కంటే అదనంగా 120 నిమిషాల (2 గంటలు) సమయాన్ని కేటాయిస్తారు.

కనీసం 10 ఓవర్ల చొప్పున…
సాధారణ గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో ఫలితం కోసం ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడాలి. కానీ సెమీఫైనల్, ఫైనల్ వంటి నాకౌట్ మ్యాచ్‌ల్లో ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 10 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేయాలి. ఒకవేళ మ్యాచ్ పూర్తయి.. టై అయితే విజేతను తేల్చడానికి సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే.. ఫలితం తేలే వరకు వరుసగా సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు. సూపర్ ఓవర్లు ఆడించలేని పరిస్థితి నెలకొంటే ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు.

అలా అయితే.. ఇలా చేస్తారు..
ఒకవేళ భారీ వర్షం లేదా ఇతర కారణాల వల్ల నిర్ణీత రోజు, రిజర్వ్ డే.. రెండు రోజుల్లో కూడా కనీసం 10 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లను ఉమ్మడి విజేతగా ప్రకటిస్తారు. సెమీఫైనల్స్‌లో అయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. కానీ ఫైనల్ రద్దయితే మాత్రం రెండు జట్లను విజేతలుగా ప్రకటించి ట్రోఫీని అందజేస్తారు.

Leave a Reply