Swatch Andhra | ఎపిని నెంబ‌ర్ వ‌న్ చేయ‌డ‌మే నా లక్ష్యం – చంద్ర‌బాబు

తణుకు – చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని సీఎం చంద్ర‌బాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో నేడు జ‌రిగిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ముందుగా ఆయ‌న పారిశుద్ధ్య కార్మికుల‌తో ముఖాముఖిగా మాట్లాడారు.. వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.. ఈ సంద‌ర్భంగా ప‌రిస‌రాల శుభ్ర‌త కోసం వారు చేస్తున్న కృషిని అభినందించారు.. వారంద‌రితో క‌ల‌సి ఫోటో దిగారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర తన జీవిత లక్ష్యమని చెప్పారు. ప్రజారోగ్యం కోసమే స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. పరిసర ప్రాంతాలను ప్రతిఒక్కరూ శుభ్రంగా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపై ప్రతి రోజు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పోస్తుందని, 51 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మున్సిపల్ సిబ్బంది సేకరిస్తున్నారని తెలిపారు. అక్టోబర్ 2న నాటికి ఎక్కడా చెత్త కనిపించకుండా చేస్తామని, ఆ బాధ్యతను మంత్రి నారాయణకు అప్పగించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆత్మగౌరవం పేరుతో గతంలో మరుగుదొడ్లు నిర్మాణానికి పిలుపునిచ్చానని చెప్పారు. 4 లక్షల 60 వేల మరుగుదొడ్లను మళ్లీ నిర్మించబోతున్నామన్నారు. ఇప్పటికే 72 వేల మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రారంభించినట్లు చంద్రబాబు వెల్లడించారు.

స్వచ్ఛాంధ్ర ఉద్యమం…

మన ఆరోగ్యానికి ఎందుకు ఇబ్భందులు వస్తున్నాయో ఆలోచించాలన్నారు చంద్ర‌బాబు. తిండి, తాగేనీరు, అపరిశుభ్రత వలన వస్తున్నాయని కూడా గమనించాలన్నారు. ఆరోగ్య శ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్‌తో 25 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపొందించామన్నారు. విజన్ రూపొందించడమే కాదని.. తలసరి ఆదాయం పెరిగిందా లేదా అని పరిశీలిస్తున్నామని అన్నారు. వారసత్వంగా 87 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలిపోయారని…దానిని తీయడానికి నాలుగైదు నెలలు పడుతుందన్నారు. స్వర్ణాంధ్ర కోసం ఉద్యమం చేస్తూనే, స్వచ్ఛాంధ్ర కోసం ఉద్యమం చేయాలన్నారు. వేస్ట్ ఎనర్జీ కింద కంపోస్టు తయారుచేయడానికి ఒక టెక్నాలజీ వచ్చిందని తెలిపారు. బయో డైవర్సిటీ పేరుతో 10 లక్షలతో మెటీరియల్ పెడితే, కంపోస్టు తయారు చేయవచ్చని చెప్పారు. తణుకు ఎన్టీఆర్‌ పార్క్‌ను తాను డెవలప్ చేశానని.. కానీ దానిని నాశనం చేశారని ఫైర్ అయ్యారు.

ప్లాస్టిక్ ప్రమాదకరం…

‘ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినపుడు, మీరు కూడా బాధ్యతతో వ్యవహరిస్తే, మంచి ఫలితాలు వస్తాయన్నారు చంద్ర‌బాబు. ఒకప్పుడు పారిశుధ్య కార్మికులను చులకనగా చూసేవారు. వారు మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. వారిపై గౌరవం పెరిగింది.. మునిసిపల్ కార్మికులు అందరిని ఆదుకుంటాం. మీ పరిసరాలు, మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సమాజం కోసం, స్వర్ణాంధ్ర కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు వచ్చారు..వారిని అభినందించాలి. వారి కోసం ఒక యాప్‌ను రూపొందిస్తాం. ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం.. పశువులు వాటిని తిని, చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వలన తినే తిండి కూడా విషం అయిపోతున్నది. క్యాన్సర్ వచ్చినప్ఫుడు బాధ పడుతున్నాం. కానీ క్యాన్సర్ కారణమైన ఆహారం గురించి ఆలోచించాలి. రాష్ట్రంలో క్యాన్సర్ రాకుండా చేయడానికి నోరి దత్తాత్రేయుడుని సలహాదారుగా నియమించాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై యుద్ధమే చేయాలి. దానివలన చెడు పరిణామాలు ఉన్నాయి. ప్రమాదకరమైన ప్లాస్టిక్ తయారుచేసే వారిని నియంత్రిద్ఢాం’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

హ‌క్కులు కావాలంటే బాధ్య‌త‌లు నిర్వ‌హంచాలి..

‘హక్కులు అడిగే వాళ్లు బాధ్యతగా ఉండాలని, చురుకుగా పని చేసిన వారికి అన్ని దక్కుతాయి అని అన్నారు చంద్ర‌బాబు. గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి ఒక్కసారైనా వచ్చారా?. పరదాలు కట్టుకుని మాత్రమే బయటకు వచ్చారు. విమానంలో వస్తే చెట్లను నరికేవాళ్లు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఒప్పుకునే వాళ్లు కాదు. మాది ప్రజా ప్రభుత్వం. సమస్యలు వినేందుకే నేను వచ్చా. పాలనలో సంస్కరణలు తెస్తాం. రాష్ట్రానికి పది లక్షల కోట్ల అప్పు ఉంది. అప్పుతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోంది. గత సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుక వెళ్తున్నాం. పేదల పింఛన్ ను రూ. 3 వేల నుంచి 4 వేలకు పెంచాం. గతంలో రూ. 200 నుంచి రూ. 2000లకు పెంచాం. దివ్యాంగులకు రూ. 3 వేలు నుంచి రూ. 6వేలు అందజేస్తున్నాం.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

47 ఏళ్ల క్రితం ఇదే రోజున ..
ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు చంద్ర‌బాబు. 41 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాన‌ని వెల్ల‌డించారు.. 9 ఏళ్ళు సమైక్యాంధ్ర సీయంగా, మొత్తంగా 14 ఏళ్ళకు పైగా సీయంగా ఉన్నా. పదేళ్ళు ప్రతిపక్ష నేతగా చేశార‌ని పేర్కొన్నారు.. ఇది ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం ఇద‌ని, అందుకే నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు, తెలుగువారికి న్యాయం చేయాలనే ఏకైక సంకల్పంతో ప‌ని చేస్తాన‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి నిమ్మల రామానాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభి రామ్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అశ్వి, తణుకు యంయల్ఏ ఆరుమిల్లి రాధాకృష్ణ, యంయల్ఏలు పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, శాసనమండలి మాజీ విప్ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *