
ముఖపత్ర కథనం
ఓం గం గణపతయే నమ:
వినాయకుడు అంటే అడ్డంకులను తొలగించేవాడు, మార్గదర్శకుడు, బుద్ధి-వివేకాలకు ప్రతీక. ఏ పూజకైనా ముందు ఆయనకు పూజ చేయడం ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం మాత్రమే కాకుండా, మన జీవన విధానానికి సంబంధించిన ఒక ముఖ్య సూత్రం కూడా.
వినాయకుడు హిందూ సంస్కృతిలో ప్రధాన స్థానంలో నిలిచిన దేవుడు. ఆయన ఉనికి కేవలం పురాణాల్లో మాత్రమే కాకుండా, ప్రతి మనిషి అంతరంగంలోనూ ఒక భావ స్వరూపంగా ఉంది. గణపతి అంటే గణాల నాయకుడు, సర్వసమూహాలకు నాయకత్వం వహించేవాడు, అందరికీ దారి చూపించేవాడు అని అర్థం. వినాయకుడిని విఘ్నేశ్వరుడు, గణనాయకుడు, లంబోదరుడు, గజాననుడు ఇలా అనేక పేర్లతో పిలుస్తారు.
ఆయన ఉనికి మనకిచ్చే ప్రధాన సందేశం ఏమిటంటే, మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు సహజం, కానీ వాటిని అధిగమించే బుద్ధి, ధైర్యం, శక్తి మనలోనే ఉన్నాయని గుర్తుచేయడం. అందుకే ఏ శుభకార్యం ప్రారంభించే ముందైనా ఆయనను పూజించడం ఆనవాయితీ. వినాయకుని పూజ మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మన మనసు పరిపరి దారులు పట్డకుండా ఒకే దిశలో కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది.
మిగతా పూజలతో పోలిస్తే వినాయక పూజకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది ఆరంభానికి సంకేతం. ఇతర దేవతల పూజలు సాధారణంగా ధనం, ధాన్యం, ఆరోగ్యం, శాంతి వంటి కోరికల సాఫల్యం కోసం జరుగుతాయి. కానీ వినాయక పూజ మాత్రం ఆ కోరికలు ఫలించడానికి అవసరమైన బలం ఇవ్వడానికి, అడ్డంకులు తొలగించడానికి, ఆలోచనలు ఒక కొలిక్కి రావడానికి చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇతర పూజలు ఫలితానికి దారితీసేవైతే, వినాయక పూజ ఆ ఫలితం దిశగా పడే మొదటి అడుగు.
మనం ఏ పనైనా ఆరంభించే ముందు దానికి అనువైన మానసిక సంసిద్ధత పొందడం అవసరం. వినాయకుడు ఆ సంసిద్ధత కలగజేస్తాడు. పూజలో వినాయకుడికి ప్రత్యేకంగా గరిక సమర్పించడం ఒక ముఖ్యమైన విశేషం. దూర్వా ఒక ఔషధ గుణం కలిగిన గడ్డి. దీనికి శీతలత్వాన్ని ఇచ్చే శక్తి ఉంది. గణేశుడు లంబోదరుడు కావడంతో శరీరంలో జీర్ణక్రియ, తాపం సమతుల్యం కావడానికి దూర్వాను ప్రతీకగా చూపారు. మరో కోణంలో దూర్వా అనేక చిన్న కాడలతో పెరుగుతుంది, దీనికి దృఢమైన జీవన శక్తి ఉంటుంది.
ఈ విధంగా గడ్డి మనిషి ఆధ్యాత్మికతకు ప్రతీక కావడం మన సంస్కృతిలోని విశేషం. వినాయక పూజలో ఉపయోగించే పత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏకవింశతి పత్రాలను సమర్పించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఆ ఆకులలోని ఆధ్యాత్మిక, ఔషధ గుణాలు మన శరీరానికి, మనస్సుకు పట్టాలనే ఉద్దేశ్యంతో ఏర్పడిన ఆచార వ్యవహారం. ఒక్కో ఆకు ఒక్కో జీవ క్రియకు సహకరిస్తుంది. పూజలో వినాయకుడికి పత్రి సమర్పించడం ద్వారా ఆయా ఆకుల శక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నట్లవుతుంది.
ఇది ఒక వైపు ఆరోగ్య పరిరక్షణ కాగా, మరో వైపు మనలోని శక్తులను జాగృతపరచే ప్రక్రియ కూడా. ఏ పూజ ప్రారంభానికైనా మొదలు వినాయకుడి పూజ చేయడానికి ప్రధాన కారణం ఆయన విఘ్నాలకు అధిపతికావడమే. జీవితం అనేక అడ్డంకుల మధ్య సాగుతూ ఉంటుంది. ఏ పని ప్రారంభించినా సవాళ్లు ఎదురవడం సహజం. మనం వాటిని ధీటుగా ఎదుర్కొనే ధైర్యం కోల్పోతే, ఆ పని విఫలమవుతుంది. కాబట్టి అది విజయవంతం కావడానికి ముందుగా ఆ అడ్డంకులను అధిగమించగల శక్తిని మనం ఆరాధించాలి.
వినాయకుడు ఆ శక్తికి ప్రతీక. అందుకే ఆయన పూజ లేకుండా శుభకార్యాన్ని ప్రారంభించడం అసంపూర్ణంగా భావిస్తారు. మనం ఒక శక్తిమంతుడి ఆశీర్వాదంతో కార్యారంభం చేస్తున్నాం కాబట్టి, తప్పక విజయవంతమవుతుంది అన్న నమ్మకం గణపతి పూజవల్ల కలుగుతుంది. సిద్ధి, బుద్ధి అనే గణేశుడి స్త్రీరూప సహచరులు మన జీవితానికి సంబంధించిన రెండు ప్రధాన శక్తులను సూచిస్తాయి. సిద్ధి అంటే సాధన ద్వారా పొందిన ఫలితాలు, బుద్ధి అంటే వాటిని సద్వినియోగం చేసుకునే జ్ఞానం.
మనం ఎన్ని విజయాలు సాధించినా వాటిని సద్వినియోగం చేసుకోవడానికి బుద్ధి అవసరం. అలాగే మనకు ఎంత జ్ఞానం ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టి ఫలితాలు పొందడానికి సిద్ధి అవసరం. ఈ రెండు శక్తులు కలసి ఉన్నప్పుడే జీవితం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే గణేశుడి పక్కన సిద్ధి, బుద్ధి ప్రతిరూపాలుగా ఉంటారు. వినాయకుడి రూపకల్పనలోనూ ఒక గొప్ప రహస్యం ఉంది. ఆయన తల ఏనుగుకు చెందింది, శరీరం మనిషికి చెందింది. ఇది రెండు విభిన్న శక్తుల సమన్వయం. ఏనుగు తల అంటే జ్ఞానం, సహనం, బలము.

మనిషి శరీరం అంటే కృషి, సంకల్పం, ఆచరణ. ఈ రెండూ కలిసినప్పుడే విజయవంతమైన జీవితం ఏర్పడుతుంది. గజాననుడి రూపం మనకు చెప్పే సందేశం ఏమిటంటే, మన ఆలోచనలు విశాలంగా ఉండాలి, కానీ ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి మనిషి శరీరం సలిపే కృషి అవసరం. ఈ రెండు లేకుండా జీవితం అసంపూర్ణం. అందుకే గణేశుడి రూపం ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. వినాయకుడి విగ్రహంలోని అంగాలన్నీ మనకు వ్యక్తిత్వ వికాసంలోని పాఠ్యంశాలు బోధిస్తాయని చెప్పవచ్చు.
అవి ఒక వ్యక్తి తన శరీరాన్ని విశేష విషయాల గ్రహణ కేంద్రంగా మార్చుకుని, ఉన్నత శిఖరాలు అధరోహించే ప్రేరణనిస్తాయి. మనీషిగా మారేందుకు సహకరిస్తాయి. ప్రపంచానికి చాలా వరకు తెలియని ఒక అంశం, వినాయకుడి పూజలో మోదకాలను సమర్పించడం వెనుక ఉన్న రహస్యం. లోపల ఉండే తీపి పదార్ధాన్ని, బయటి దళసరి తోలుతో కప్పి ఉంచే పదార్థమే మోదకం. ఇది మనిషి మనసు, శరీరాల్ని సూచిస్తుంది. మనసు లోపల మాధుర్యం నిండి ఉంటే, బయటి శరీరం దారుఢ్యంతో రక్షణ కవచంలా ఉంటుంది.
గణేశుడు మోదకాలను ఇష్టపడటం అంటే మనిషి లోపలి మాధుర్యం మాటలు, చేతల ద్వారా వెలుగులోకి రావాలని అప్పడే అతన్ని అందరు ఇష్టపడతారన్నదే సందేశం. వినాయకుడి ఆరాధన కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, ఇది సామాజిక ఐక్యతకు ప్రతీక. గణపతి నవరాత్రులు మహారాష్ట్రలో ప్రారంభమై, తరువాత దేశమంతట వ్యాప్తి చెందాయి. బాల గంగాధర తిలక్ గణేశోత్సవాన్ని ప్రజల్లో జాతీయ భావన కలిగించడానికి, బ్రిటిష్ పాలనలోని అణచివేతలకు వ్యతిరేకంగా దేశ ప్రజల ఐక్యతకు ప్రతీకగా ఉపయోగించారు.
ఈ వేడుకల ద్వారా ఒక సామాజిక బంధం ఏర్పడింది. దీని అర్థం ఏమిటంటే వినాయకుడి పూజ మనిషిని వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాదు, సమూహ స్థాయిలోనూ బలపరుస్తుంది. సమాజం ఒకే ఆలోచనలో కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది. అందుకే ఆయన ఉనికి ఒకరిని మాత్రమే కాకుండా పూర్తి సమాజాన్ని మేల్కొలుపుతుంది. వినాయకుడి తొండం కుడివైపున, ఎడమవైపున, లేదా మధ్యలో వంగి ఉండే మూడు రూపాలు కలిగి ఉండడం మనం చూస్తాం. తొండం కుడివైపుకు వంగితే అది కఠినమైన నియమాలను సూచిస్తుంది.
అలాంటి గణపతిని ఆరాధించడానికి కఠినమైన నియమాలను పాటించాలి. ఎడమ వైపు వంగితే అది సౌమ్యతను, సులభతను సూచిస్తుంది. మంటపాలు, ఇళ్ళలోని సాధారణ పూజల్లో గణపతి యొక్క ఈ రూపమే ఎక్కువగా పూజలందుకుంటుంది. మధ్యలో వంగితే అది సమతుల్యాన్ని సూచిస్తుంది. ఈ రూపకల్పనలోని లోతైన సందేశం ఏమిటంటే మన జీవితంలో ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవడం, మరికొన్ని సమయాల్లో సౌమ్యత ప్రదర్శించడం అవసరం, కానీ ప్రధానంగా సమతుల్యతను ఆచరణ చేసుకోవాలి. గణేశుడు మనలో ఆ సమతుల్యాన్ని కల్పించే గురువు.
వినాయకుడి ప్రతిరూపం కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, థాయిలాండ్, ఇండోనేషియా, కాంబోడియా, నేపాల్, శ్రీలంక, జపాన్ వంటి దేశాలలోనూ గణనీయమైన ప్రాచుర్యం పొందింది. అక్కడ ఆయనను జ్ఞాన దేవుడిగా, రక్షకుడిగా, విజయప్రదాతగా ఆరాధిస్తారు. ఇది భారతీయ సంస్కృతి ఇతర ప్రాంతాల్లో ఎంత లోతైన ప్రభావం చూపిందో తెలియజేస్తుంది. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే జపాన్లో గణేశుడిని కాంగిటెన్ అని పిలుస్తారు, ఆయనను సుఖసంపదల దేవుడిగా ఆరాధిస్తారు.
ఈ విధంగా వినాయకుడి ఉనికి కేవలం ఒక మతపరిమితి కాకుండా, మానవాళికి ఒక సామూహిక జ్ఞాన ప్రతీకగా మారింది. ఆధునిక కాలంలో విద్యార్థులకు వినాయకుడి పూజ ఒక గొప్ప స్ఫూర్తి. ఆయనను విద్య యొక్క ఆరంభదేవుడిగా పూజించడం వెనుక లోతైన కారణం ఉంది. చదువులో దృష్టి మరలడం, జ్ఞాపకశక్తి లోపించడం వంటి ఎన్నో అడ్డంకులు వస్తాయి. వినాయకుడు ఆ అడ్డంకులను తొలగించే శక్తి రూపంగా భావిస్తారు. విద్యార్థి ఆయనను ఆరాధించడం అంటే తన మనసులో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం.

ఏ పరీక్షకైనా వెళ్ళే ముందు విద్యార్థులు గణపతిని ప్రార్థిస్తే అది కేవలం దేవుడిని స్మరించడం కాదు, నేను పరీక్షకి సంసిద్ధున్ని అయ్యాను, నా కృషి ఫలిస్తుంది అన్న ఆత్మనమ్మకాన్ని ప్రోది చేసుకోవడం. ఈ నమ్మకమేగా విజయానికి మూలం. వ్యక్తిత్వ వికాసానికి వినాయకుడు అనేక పాఠాలు చెబుతాడు. ఉదాహరణకు ఆయన వాహనం ఎలుక. ఎలుక ఒక చిన్న జీవి, కానీ ఏ గోడనైనా తవ్వగలదు. ఇది మనిషి ఎంత చిన్నవాడైనా, ఎంత తక్కువ వనరులు ఉన్నా, అతనిలో పట్టుదల ఉంటే ఏ అడ్డంకినైనా అధిగమించగలడని సూచిస్తుంది.
ఎలుక మన కోరికలను, మన వాంఛలను కూడా సూచిస్తుంది. వినాయకుడు వాటి మీద కూర్చోవడం అంటే మన కోరికలు మనపై కాకుండా, మనం వాటిపై నియంత్రణ సాధించాలి అన్నదానికి సూచన. ఇది ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పాఠం. కోరికలు లేకుండా జీవితం ఉండదు, కానీ వాటికి బానిసలం కాకుండా, నియంత్రించడం అవసరం. వినాయకుడి పూజలో మరో విశేషం ప్రణవోపాసన. ఓం అనే అక్షరానికి ఆది అంతం లేనట్లు గణేశుడికి కూడా తుది మొదలు లేదు అని భావిస్తారు. అందుకే ఆయనను ఓంకార స్వరూపుడు అంటారు.
ఓం అనే శబ్దం విశ్వానికి మూలధ్వని. గణేశుడు ఆ శబ్దానికి ప్రతీక. దీని అర్థం ఏమిటంటే మనం గణేశుడిని ఆరాధించడం అంటే విశ్వంలోని సమగ్ర శక్తిని ఆరాధించడం. ప్రతి మనిషి తనలో ఒక విశ్వాన్ని మోసుకెళ్తున్నాడనే గుర్తింపును కలిగించడం. ఇది మనసులో ఉన్న చిన్నతనాన్ని తొలగించి, విశాలతను అనుభూతి చేయిస్తుంది. సామాజిక దృష్టిలో వినాయక పూజ మనిషిలో వినయాన్ని పెంపొందిస్తుంది. గణేశుడు ఎంత బలవంతుడైనా, ఆయనను ప్రసన్నవదనుడు అని పిలుస్తారు.
మనిషి ఎంత జ్ఞానం, సంపద, శక్తి సంపాదించినా ప్రసన్నతతో కూడిన వినయం లేకుంటే ఆ విజయాలు పతనానికి దారి తీస్తాయి. గణేశుడు మనకు చెప్పే పాఠం ఏమిటంటే, బలమైన వాడు వినయవంతుడై ఉండాలి. అదే నిజమైన నాయకత్వం. దీని కారణంగా ఆయనను గణనాయకుడు అంటారు. నాయకుడు అంటే తాను ముందుండి ఇతరులను నడిపించేవాడు, కానీ అదే సమయంలో వారితో కలిసిపోవడం తెలిసినవాడు. గణేశుడు నాయకత్వానికి నిదర్శనం.
గణేశుని కథల్లో ఒక విశేషం తండ్రి అయిన శివుడు ఆయన తలను నరికివేయడం, తరువాత ఏనుగు తలను అమర్చడం. ఈ కథలో దాగి ఉన్న లోతైన తత్త్వం ఏమిటంటే, మన పాత ఆలోచనలను, అహంకారాన్ని విడిచి పెట్టినప్పుడే కొత్త జ్ఞానం, కొత్త దృష్టికోణం మనకు లభిస్తుంది. ఏనుగు తల అంటే కొత్త ఆలోచన, విశాల దృష్టి. అంటే జీవితంలో మార్పు అవసరమని, పాత చింతకాయ భావాలను, మూర్ఖత్వాన్ని వదిలేయాలని ఈ కథ చెప్పే సందేశం. ఇది మనిషి వ్యక్తిత్వ వికసనకు గొప్ప పాఠం. మనం మార్పును ఆహ్వానించాలి. సదా నేర్చుకుంటూనే ఉండాలి.
వినాయకుడి పూజలో శాస్త్రీయ కోణం కూడా ఉంది. గణపతి విగ్రహాన్ని మట్టితో తయారు చేస్తారు. పూజ పూర్తయిన తరువాత ఆ విగ్రహాన్ని నీటిలో విసర్జిస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, మట్టి విగ్రహం మనం ప్రకృతికి తిరిగి ఇచ్చే ఒక విధానం. ఇది పర్యావరణ సమతుల్యానికి అనుకూలం. మనం ప్రకృతిని ఆరాధించి, తరువాత తిరిగి ప్రకృతిలో కలిపేస్తాం. ఇది మనిషి ప్రకృతితో మమేకమై ఉండాలన్న సూచన. ఆధునిక కాలంలో ఈ ఆచారం పర్యావరణ పరిరక్షణకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
ఈ విధంగా వినాయక పూజ కేవలం మతపరమైనది కాదు, శాస్త్రీయమైనది కూడా. వినాయకుడి ఆరాధనలో మరో ఆధ్యాత్మిక విశేషం ఏమిటంటే ఆయనను మంగళకర్త అని పిలుస్తారు. మంగళం అంటే శుభం, శాంతి. ఆయన పూజ ద్వారా మనసు ప్రశాంతమవుతుంది, మనలోని ఆందోళనలు తొలగుతాయి. మనం పొందే ప్రశాంతతే శాంతి, ఆరోగ్యం, ఆనందాలకి మూలం. గణేశుడు మనలో ఆ ప్రశాంతతను కలిగించే శక్తి. మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువగా ఉన్న ఆధునిక జీవితంలో ఆయన పూజ మనస్సుకు ఒక థెరపీ. కూర్చుని గణేశుడి మంత్రం జపించడం అంటే మనసును శాంతపరచడం, ఆత్మలోని శక్తిని మేల్కొలపడం. ఇది వ్యక్తిగత జీవితానికీ, సామాజిక జీవితానికీ మేలే కదా!
మొత్తానికి వినాయకుడి ఉనికి ఆధ్యాత్మికం, సామాజికం, శాస్త్రీయం అన్న మూడు కోణాల కలయిక. ఆయన పూజలో ఉన్న విశేషాలు – దూర్వా గడ్డి, పత్రి, మోదకాలు, విగ్రహ రూపకల్పన ఇవన్నీ మనిషి జీవితానికి అవసరమైన పాఠాలను అందిస్తాయి. ఆయన కథలు మనకు మార్పును స్వీకరించడం, కోరికలను నియంత్రించడం, వినయంతో ఉండడం, సమాజానికి తోడ్పడడం వంటి పాఠాలను చెబుతాయి. వ్యక్తిత్వ వికాసానికి ఆయన ఒక మార్గదర్శకుడు.
ఆధ్యాత్మికంగా ఆయన మనలో ఏకాగ్రత, ధైర్యం, జ్ఞానం కలిగిస్తాడు. సామాజికంగా ఆయన ఐక్యత, సహకారం, నాయకత్వం నేర్పిస్తాడు. ఈ విధంగా వినాయకుడి ఆరాధన ఒక సమగ్ర తత్త్వశాస్త్రం, ఒక జీవనశాస్త్రం. ప్రతి మనిషి జీవితాన్ని మేల్కొలిపే ఒక శాశ్వత స్ఫూర్తి.
– ప్రతాప వెంకట సుబ్బారాయుడు

రమణికి రాజారావుకి పెళ్లయి సంవత్సరం అయ్యింది.
ఈ తరం అమ్మాయిల లాగే రమణికి ఎన్నో ఆశలు.. కోరికలు.
ప్రతిరోజు భర్త తనని ఎక్కడికైనా తీసుకెళ్లాలి.
ప్రతివారం ఓ సినిమాకి..
ప్రతినెల ఒక చిన్న ట్రిప్..
ప్రతి చిన్నదానికి ఓ చీర కోసం షాపింగ్..
ఇలాంటివన్నీ కోరికలు రమణీకి.
కొత్తలో భార్య మీద ఉన్న మోజుతో అడిగిన ప్రతిదీ చేసేవాడు రాజారావు.
కానీ, రాను రాను భార్య చేసే అతి ఖర్చు అతనికి ప్రాణసంకటంగా మారింది.
మరి ఎవరికైనా ఖర్చు పెట్టే భార్య అంటే భయమేగా..?
మన రాజారావుకి కూడా అదే బాధ, టెన్షన్.
రాజారావు తీసుకు వెళ్లకపోతే పక్కింటి వాళ్లతో, ఎదురింటి వాళ్ళతో షాపింగ్ లు చేయడం మొదలుపెట్టింది రమణి.
అది మరీ కష్టమైంది రాజారావుకి. ఏమైనా అంటే, “ఆ…ఆ వాళ్ళు కొనుక్కున్నారు, నేను కొనకపోతే బాగుండ”దని అంటూ సాగదీసేది.
రాను రాను ఖర్చులు పెరిగాయి. ప్రతిరోజు ఎక్కడో దగ్గరికి వెళ్లడం, ఆటోలకి, క్యాబ్ లకి తగలేయడం. పూజలని, కిట్టీలని, ఫ్రెండ్స్ అని, ఇలా ఏదో ఒక కారణం చెప్పి రాజారావు దగ్గర 1000 రూపాయలు తీసుకునేది. “అవసరమా అంత ఖర్చు” అనే భర్త మాటల్ని అసలు లెక్క చేసేది కాదు రమణి. నయాన భయానా చెప్పి చూశాడు రాజారావు. తనకి వచ్చేదే జీతం 70,000/- ఇలా నెలకి 30,000 ఖర్చు చేస్తే రేపు పిల్లలు పుడితే ఎలా? అని బెదిరించి చూశాడు. “అప్పుడే పిల్లలు ఏంటి? ఐదు సంవత్సరాల వరకు నో పిల్లలు” అని తెగేసి చెప్పింది రమణి.
కాలం ఎవరి కోసమో ఆగదు గడిచిపోతూనే ఉంటుంది. భార్యకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయించి అన్నీ నేర్పించాడు రాజారావు. అదే తన పాలిట వరమైంది. ఇప్పుడు ఇన్ స్టా, ఫేస్బుక్ లో రీల్స్ చూసి మురిసి పోయింది రమణి. అన్నీ భర్తను అడిగి టకటక నేర్చుకుంది. రీల్స్ ఎలా చేయాలి? ఎలా అప్లోడ్ చేయాలి? ఎలా ఎడిటింగ్ చేయాలి? వగైరా వగైరాలన్నీ చకచకా నేర్చుకుంది. ఎకౌంటు ఓపెన్ చేసి తనూ రీల్స్ చేయడం మొదలు పెట్టింది. మొదట్లో రాజారావుకి నచ్చకపోయినా భార్య ఉత్సాహం చూసి సరే అని ఒప్పుకున్నాడు అన్నిటి కంటే అతనికి నచ్చింది రీల్స్ మోజులో పడి బయటికి వెళ్లడం తగ్గించింది రమణి. దాంతో ఖర్చు తగ్గింది రాజారావుకి. హమ్మయ్య ఇది రోజు డబ్బులు అడగడం తగ్గింది, ఖర్చు తగ్గింది, అనుకుని సంతోషించాడు.
భర్త ఆఫీసుకు వెళ్లగానే చక్కగా తయారవ్వడం, రీల్స్ చేసుకోవడంతో టైం గడిచిపోతోంది రమణికి. రాత్రికి కూర్చుని వాటిని ఎడిటింగ్ చేసుకోవడం అప్డ్ లోడ్ చేయడంతో సరిపోతుంది. రాజారావుకి ఈ పరిణామం ఎంతో రిలీఫ్ గా ఉంది ప్రతి రోజు బయటికి వెళ్లడం తప్పింది. షాపింగ్ ఖర్చు, క్యాబ్ ఖర్చు మిగిలింది. పైగా కొత్త కొత్త ఐడియాస్ తో రీల్స్ ఎలా చేయాలని కనిపెట్టడం వాటిని షూట్ చేసుకోవడంతో బిజీ అయి పోయిన రమణిని చూసి తెగ సంతోషం అయిపోయింది అతనికి. రోజు తను అప్లోడ్ చేసిన రీల్స్ కి ఎన్ని లైకులు వచ్చాయో ఎన్ని కామెంట్స్ వచ్చాయో చెప్తూ ఉండేది రమణి. అంతేకాదు మెల్లిగా ఆ వీధిలో పాపులారిటీ కూడా సంపాదించుకుంది. రమణి రీల్స్ ద్వారా రాను రాను ఫాలోవర్స్ ఎక్కువై పోయారు. ఫ్యాన్స్ పెరిగారు మెల్లిగా ఆ వీధి నుండి ఊరికి, ఊరు నుండి ప్రపంచానికి రమణి రీల్స్ పాపులర్ అవ్వసాగాయి. నాలుగైదు వైరల్ కూడా అయ్యాయి ఇప్పుడు రమణి ఒట్టి రమణి కాదు, రీల్స్ రమణిగా పేరు వచ్చింది. ఇప్పుడు అసలు ఖాళీయే లేదు. రాజారావుకి ఖర్చు తప్పింది రమణికి పాపులారిటీ పెరిగింది 6 నెలలలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయించాడు భార్య చేత.
వ్యూస్ ఎక్కువ రావడంతో ఫాలోయర్స్ పెరిగి చానల్ మరింత పాపులర్ అయ్యి ఇన్కమ్ కూడా రావడం మొదలైంది. రాజారావు ఆనందానికి అవధులు లేవు. రీల్స్ రమణి ఇప్పుడు 3000 రీల్స్, 30 లక్షల ఫాలోయర్స్ తో, సక్సెస్ ఫుల్ గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో వెలిగిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం? మీ లోనూ ఓ రమణి దాగుంటుంది. బయటికి తీయండి..!
