కర్నూల్ బ్యూరో, ఆగస్టు 14, (ఆంధ్రప్రభ) : ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఉమ్మడి కర్నూలు జిల్లా, ఆత్మకూరు (Atmakur) పరిధిలోని వడ్ల రామాపురం కు చెందిన సుగులూరు చిన్నన్న (Suguluru Chinnanna) మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు వడ్లరామాపురంలోని ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. చిన్నన్న ప్రస్తుతం రాజ్ నందు గావు సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం.
మూడు దశాబ్దాలుగా.. మావోయిస్టు దళాల్లో కొనసాగుతున్న చిన్నన్న.. కర్నూలు జిల్లా (Kurnool District) లో వేంపెంట ఘటనతో పాటు.. కరువు దాడులు, సినిమా ధియేటర్ల పేల్చివేత, వాహన దగ్ధం, సున్నిపెంట పోలీస్ స్టేషన్ పేల్చివేత.. ఎన్నో ఘటనల్లో.. సుగులూరు చిన్నన్న నిందితుడు. 2006లో వేంపెంట ఘటన అనంతరం.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలోకి వెళ్లిన.. మావోయిస్టు చిన్నన్న… దాదాపు రెండు దశాబ్దాలుగా దండకారణ్యం కేంద్రంగా చిన్నన్న పనిచేశారు.
మూడు దశాబ్దాలుగా ఉద్యమంలోనే …
తెలుగు రెండు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవులను కేంద్రంగా చేసుకొని ఒకప్పుడు బలమైన ఉద్యమం కొనసాగింది. అటవీ సమీపంలోని గిరిజనుల (Tribal) తో పాటు తాడిత, పీడిత ప్రజలకు అండగా ఉంటూ మావోలు తమ ఉద్యమాన్ని కొనసాగించారు. ఇదే సందర్భంలో పెత్తందారులకు, అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఉద్యమబాటను నడిపించారు. ఇలా ఒకటి కాదు.. రెండు దాదాపు రెండున్నర దశబ్దాల పాటు నల్లమలలో ఉద్యమం తీవ్రంగా కొనసాగింది. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) కు చెందిన ఎందరో యువతీ, యువకులు ఉద్యమం వైపు అడుగులు వేయగా, ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎందరో మృతిచెందగా, రూ.కోట్ల అస్తులు ద్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆత్మకూరు, శ్రీశైలం, ప్రకాశం, మార్కాపురం అడవులను కేంద్రంగా చేసుకొని నల్లమలలో మావోల ఉద్యమం కొనసాగింది.
1988 నుంచి మొదలు…
మావోయిస్టు (Maoist) దళాలు నల్లమల్ల అటవీ ప్రాంతంలో 1989 నుంచి జోరుగా కొనసాగాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కేవలం మూడు దళాలు మాత్రమే ప్రజల కోసం పోరాటాలు మొదలుపెట్టాయి. ఈ ప్రాంతంలో పనిచేసిన దళాల వరుసలో ఒకటి మహానంది దళం. ఆ తర్వాత ఈ గ్రూపులు నక్సలైట్లుగా రూపాంతరం చెందారు. ఇలా మొదలైన నక్సలిజంతో ఈ ఉద్యమంలో ఎన్నో ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో 1990 దశకంలో ఉద్యమంకు అడుగులు పడ్డాయి. ఈ ఉద్యమంకు అడుగులు పడేందుకు ప్రధాన కారణం అప్పట్లో అటవీ ఉత్పత్తుల ద్వారా ఎందరో పొలుపరులు, గ్రామాల ప్రజలు ఆధారపడి జీవించే వారు. వీటితో పాటు కొండ ప్రాంతంలో పనిచేసుకుంటూ కొండల్లో నుండి ఎదురు, కాశిగడ్డి, ఎండిన కలప తీసుకొనివచ్చి ఇక్కడ జీవనం కొనసాగించేవారు. అయితే అటవీ అధికారుల (Forest officials) అనుమతులు లేకుండా అడవుల్లో సంచరించడం, ఆటవీ ఉత్పత్తులను తరలించడంపై అటవీ సిబ్బంది కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేయడమే నల్లమల్ల ప్రాంతంలో రావోయిస్టులు రావడానికి గల ముఖ్య కారణాలు.
ఈ క్రమంలో వడ్లరామాపురం (Vadlaramapuram) కు చెందిన సుగులూరి చిన్నన్న పట్టుపురుగుల బుట్టలు, తడికలు అల్లుకొని పేదరికంతో జీవించేవారు. అటవీశాఖ అధికారులు దళితులను నానా చిత్రహింసలు చేసి తప్పుడు కేసులు పెట్టడంతో మావోయిస్టుల ఉనికిని చాటుకున్న సుగులూరి చిన్నన్న దళం కమాండర్ గా ఉండి బైర్లూటి (Bairluti) ప్రాంతంలో ఓ రేంజర్ ను బండికి కట్టివేసి దాడి చేసిన సందర్భాలున్నాయి. వీటితో పాటు అటవీ సమీపంలో నివసించే గ్రామాల్లో తాడిత, పీడిత ప్రజలపై గ్రామ పెత్తందారుల పెత్తనం అధికంగా ఉండేది. వీటి మూలంగా ఇబ్బందులకు గురైనవారు. కులపీడనకు గురైనవారు నక్సలిజం వైపు ఆకరితులై ఉద్యమం వైపు అడుగులు వేసిన వారు లేకపోలేదు.
నక్సలిజం ఉద్యమంలో వేంపెంట ఘటన ఓ మైలురాయి..
అగ్రవర్ణాలు, భూస్వాముల దౌర్జన్యాలలో వేంపెట ఘటన ఒకటి. పాములపాడు మండల పరిధిలోని వెంపెంట గ్రామంలో కాట నిర్వహణ అంశంలో భూస్వామ్య, అగ్రవర్ణాలు, దళిత వర్గాల మద్య ఏర్పడిన చిన్న వివాదం వేంపెంట (Vempenta) మారణవోమంకు కారణమైంది. ఈ క్రమంలో ఓ వర్గంకు స్థానిక అగ్రవర్ణం అండగా నిలువగా, దళిత వర్గంకు నక్సల్స్ అండగా నిలిచారు. ఈ క్రమంలో ఓ వర్గం దళిత వారు దాడి చేయడం. దొరికిన వారిని దొరికినట్లు హతమార్చడం.. ఉద్యమం వైపు దారి తీసింది. ఇలా మొదలైన నక్సలిజం ఉద్యమం నల్లమల కేంద్రంగా మహానంది సమీపంలో రహదారిలో కానిస్టేబుల్ (Constable) హాత్యోందంతో మొదలై, ఆ తర్వాత కొత్తపల్లి మండలంలో పోలీసు ఇన్ ఫార్మర్ పేరుతో ఓ వ్యక్తి కాల్చివేత, ఇక కురుకుంద గ్రామంకు చెందిన రామయ్య దారుణ హత్య, కరువుదాడులు ఇలా ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి.
సున్నిపెంట పోలీసు స్టేషన్ పేల్చివేత, ఆత్మకూరు సినిమా థియేటర్ పేల్చివేత ఇలా ఎన్నో ఘటనలు లేకపోలేదు. ఇదే సమయంలో ఎంతో మంది పోలీసు ఎన్ కౌంటర్లలో నక్సల్స్ మృతిచెందిన వారు లేకపోలేదు. ఈ ఘటనల తర్వాత దండకారణ్యం కేంద్రంగా నక్సలైట్లను మావోయిస్టు (Maoist) పార్టీగా గుర్తించారు. ఇదే సమయంలో 2006లో వేంపెంటలో జరిగిన దారుణ మారణకాండకు ప్రతీకారంగా నల్లకాల్వ సమీపంలో నల్లమల అడవుల్లోని రుద్రకోడూరు ఆలయ సమీపంలో 8మంది వేంపెట గ్రామస్థుల ఊచకోత ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ తర్వాత ఎన్నో పరిణామాల నేపథ్యంలో చర్చల పేరిట మావోలపై ప్రభుత్వ దమనకాండ మొదలైంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన 50మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే అప్పట్లో ఉద్యమంలో కీలకం వహించిన ఆత్మకూరు మండలం (Atmakur Mandal) వద్ద రామాపురం గ్రామంకు చెందిన సుగులూరు చిన్నన్న ఒకరు.
మూడు దశాబ్దాలుగా అడవిలోనే…
ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) లోని నక్సల్స్ ఉద్యమంలో కీలక దళ సభ్యుడు సుగులూరు చిన్నన్న ఆత్మకూరు మండలం వద్ద రామాపురం గ్రామంకు చెందిన చిన్నన్న పదవ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత అటవీ సమీప గ్రామాల్లో తాడిత, పీడిత ప్రజలపై ఆటవీ సిబ్బంది ఆరాచకం, దళిత వర్గాల అణిచివేతకు అగ్రవర్ణాల ఆహంబావం తదితర వాటిని వ్యతిరేకిస్తూ ఉద్యమబాట పట్టారు. నల్లమల అడవులపై మొదటి నుంచి మంచి పట్టున్న సుగులూరు చిన్నన్న నల్లమల ఏరియా కమిటీ సభ్యుల నేతృత్వంలో అనేక ఉద్యమ కార్యక్రమాలు, హింసాత్మక ఘటనలకు కీలకంగా వ్యవహారించారు. వేంపెంట (Vempenta) ఊచకోత అనంతరం ఇతను మండల పరిధిలోని వడ్లరామాపురం గ్రామానికి రావడంతో 25 సంవత్సరాల తర్వాత మావోయిస్టుల ఉనికి మళ్లీ తెరపైకి రావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం ఉలిక్కిపాటుకు గురైంది.
అయితే 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) మావోయిస్టు దళాలను చర్చలకు రావాలని కొల్లాపురం అటవీ ప్రాంతానికి పిలిచి చర్చలు నిర్వహించినా ఫలితం కానరాలేదు. అయితే ఆ తర్వాత మావోయిస్టు దళాల ఉనికిని గుర్తించిన ప్రభుత్వం.. అప్పట్లో పలు ఎన్ కౌంటర్లలో కీలక సభ్యులను హతమార్చారు. అప్పటినుండి దాదాపుగా 25 సంవత్సరాలుగా నల్లమల్ల అటవీ ప్రాంతం (Nallamalla forest area) లో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గుముఖ పట్టింది. ఇటువంటి కాలంలో మళ్లీ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) పోలీసులు సుగులూరి చిన్నన్న కోసం రెండు నెలల క్రితం ఈ ప్రాంతానికి రావడం గమనార్హం.
ఆత్మకూరు సమీపంలోని వడ్ల రామాపురం (Vadlaramapuram) లకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు సుగులూరు చిన్నన్న కుటుంబ సభ్యుల వివరాలను ఆరా తీయడంతో పాటు అతని వివరాలు తెలుసుకొని వెళ్లారు. అప్పటి నుంచి దండకారణ్యంలో సుగులూరు చిన్నన్న ఎక్కడో ఓ చోట సేఫ్ గా ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఆయన గురువారం జరిగిన ఎన్ కౌంటర్ (Encounter) లో మృతి చెందినట్లు పోలీసుల నుంచి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
సుగులూరు చిన్నన్న కుటుంబ నేపథ్యం ఇది..
సుగులూరు చిన్నన్న కుటుంబ సభ్యులను పరిగణలోకి తీసుకుంటే వీరు నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కలున్నారు. తండ్రి దానమయ్య, సుగులూరు చిన్నన్న భార్య సరోజు. ఆమెది కొత్తపల్లి మండలం వద్ద దుద్యాల. వారికి ఇద్దరు పిల్లలు. సుగులూరు చిన్నన్న 1996లో ఉద్యమంలోకి పోయారు. ఆయన భార్య కూడా కొద్దిరోజులు ఉద్యమంలో పనిచేసినా ఆ తర్వాత తిరిగి వచ్చేశారు. ఆమె బయటకి వచ్చిన తర్వాత పిల్లలను చదివించుకుంది. ప్రస్తుతం పిల్లలు మంచి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ క్రమంలో తమ తండ్రిని ఉద్యమ బాట నుంచి బయటకు తెచ్చేందుకు అటు అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మరోవైపు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం దండకారణ్యంపై అటు పోలీసులు, మరోవైపు సీఆర్పీ బలగాల గాలింపులు తీవ్రం కావడంతో మావోయిస్టుల ఉనికికి ప్రమాదంగా మారింది. ఆ క్రమంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం అడవిబాట పట్టిన సుగులూరు చిన్నన్న చివరకు బలగాల ఎన్ కౌంటర్ లో మృతి చెందడం గమనార్హం.