విద్యార్ధులు అన్ని రంగాలలో రాణించాలి…

- పంతంగిలో రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడలు ప్రారంభం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు ఇతర అన్ని రంగాలలో రాణించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ రోజు యాదాద్రి పంతంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ పాఠశాల క్రీడా సమాఖ్య రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల కోకో క్రీడాకారులతో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థుల తల్లిదండ్రులు ర్యాంకుల వేటలో పిల్లలపై విపరీతమైన మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నారని, క్రీడల విషయంలో అప్రోత్సాహం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల ఆలోచన విధానం మారాలని, ర్యాంకుల కోసమే కాకుండా క్రీడల్లో రాణించే విధంగా తమ పిల్లల్ని ప్రోత్సహించాలని సూచించారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆటలు ఆడటం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని అన్నారు. అనారోగ్యానికి గురికాకుండా మనల్ని మనమే కాపాడుకోవచ్చని తెలిపారు. ఖోఖో క్రీడల్లో పాల్గొనే ప్రతి ఒక్క క్రీడాకారునికి అభినందనలు తెలిపారు. పంతంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాత్రిపూట క్రీడల నిర్వహణకు విద్యుత్ దీపాలు అవసరం ఉన్నాయని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వెంటనే ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, గ్రామ మాజీ సర్పంచ్ బాతరాజు సత్యం తదితర మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
