WGL | విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
పెద్దవంగర, ఫిబ్రవరి 15(ఆంధ్రప్రభ) : విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహనా కలిగి ఉండాలని తొర్రూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత తెలిపారు. శనివారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.
సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత మాట్లాడుతూ… విద్యార్థులు చట్టాలపై అవగాహనా కలిగి ఉంటే నేరాలు చేయడానికి భయపడతారని సూచించారు. విద్యార్థులకు బాలల హక్కులు, జువేనైల్ జస్టిస్ చట్టం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ,పోక్సో చట్టం, వెహికల్ యాక్ట్, మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పలితాలు సంబంధిత చట్టాలపై అవగాహనా కల్పించారు.
ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు నాగరిక చట్టంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే మంచి స్థాయికి చేరుకుంటారని తెలిపారు. చట్టాలపై అవగాహన పెంచుకొని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా పాఠశాలలో వసతులు, భోజనం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్దవంగర ఇంచార్జి ఎస్సై రాంజీ నాయక్, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి, జెడ్పిహెచ్ఎస్ ఇంచార్జి ప్రిన్సిపాల్ రాజలింగం, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.