అదృశ్యమైన విద్యార్థి..

హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం జయగిరి సమీపంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలుర వసతి గృహం నుండి విద్యార్థి అదృశ్యమైన ఉదంతం ఇది. దీంతో తోటి విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమ కుమారుడు హేమంత్ కనిపించకపోవడంతో తల్లిదండ్రుల పరిస్థితి ఆవేదనభరితంగా మారింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండ జిల్లా నడికూడ మండలం చౌటపర్తి గ్రామానికి చెందిన యెలగొండ హేమంత్, జయగిరి ఎంజేపీ బాలుర గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాడు.
శనివారం తెల్లవారుజామున వసతిగృహంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పరిశీలిస్తుండగా హేమంత్ కనిపించలేదు.రోజువారీగా తన స్నేహితులతో హేమంత్ రాత్రి నిద్రించాడు. తెల్లవారే సరికి హేమంత్ కనిపించకపోవడంతో తోటి విద్యార్థులు భయాంధోళనకు గురయ్యారు. దీంతో సిబ్బంది పాఠశాల పరిసరాలను పరిశీలించినా విద్యార్థి జాడ కాన రాలేదు.ఈమేరకు గురుకుల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేశారు
వెనుక గేటు వద్ద సెక్యూరిటీ లేకపోవడమే కారణమా..
పాఠశాల విస్తీర్ణం పెద్దదిగా ఉండడంతోపాటు చుట్టూ పరిసరాలు పొలాలు ఉండడం మూలంగా విద్యార్థులు బయటికి వెళ్లడానికి సులభం అవుతుంది.అంతేగాక పాఠశాల కిటికీలు ఊడిపోవడం మూలంగా దూకి వెళ్లడానికి వీలవుతుంది.వసతి గృహనికి రెండు గేట్లు ఉన్నాయి. ముందు ప్రదాన గేటు వద్దనే సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉంటుంది. వెనుక వైపున ఉన్న గేటు వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో పాటు ఉదయం వేళలో వసతి గృహనికి కావాల్సిన కాయకూరలు,పాలు ఈగేట్ నుండే తీసుకువెళ్తారు. ఇదే అదనుగా హేమంత్ ఊచలు లేని కిటికీ నుండి బయటికి వచ్చి సులభంగా గేటు దూకి వెళ్లిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.
ప్రధానంగా హేమంత్ వసతి గృహం నుండి అకస్మాత్తుగా బయటికి వెళ్లడానికి కారణం.. ఏమై ఉంటుందోనని చర్చనీయాంశంగా మారింది. గతంలో వసతి గృహం వెనుక గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని, కిటికీలకు మరమత్తు చేపట్టాలని, సరైన మౌలిక వసతులు కల్పించాలని వసతి గృహ అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని ఆరోపణలు వినవస్తున్నాయి.తల్లిదండ్రులు తమ కుమారుడు హేమంత్ అదృశ్యంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దేవేందర్ తెలిపారు
