పొద్దు తిరుగుడు పువ్వుల రాజకీయాలు మానుకో కడియం

- దమ్ముంటే రాజీనామా చేయి, మళ్లీ పోటీ చేసి గెలువు
- ఉపఎన్నికల్లో నీ ఓటమి ఖాయం… వెంటనే బీజేపీలోకి జంప్ ఖాయం
- మీడియా సమావేశంలో కడియంపై ఎమ్మెల్యే పల్లా ఫైర్
లింఘాలఘన్‌పూర్ : లింఘాలఘన్ పూర్ మండలంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం మీద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ గెలుస్తుందనే భయంతో ఉద్దేశపూర్వకంగా ప్రచార పర్మిషన్ను నిరాకరించారని ఆయన ఆరోపించారు. తాను ప్రజా ప్రాచారానికి రాకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి అడ్డుకున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేగా ఎన్నుకోవడమే తప్ప కడియం ఈ ప్రాంతానికి ఎప్పుడూ న్యాయం చేయలేదని పల్లా విమర్శించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చి చిల్లర రాజకీయాలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీ, సిగ్గు ఉంటేనేమి… వెంటనే రాజీనామా చేసి, ఏ పార్టీ మీద గెలిచావో ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాలు చేశారు.
ఉపఎన్నికలు తప్పవని, అందులో కడియం ఓటమి ఖాయమని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. బీజేపీలోకి అతని జంప్ కూడా ఖాయమేనని ఎద్దేవా చేశారు. నీ పిట్ట బెదిరింపులకు, ఉడుత బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరు అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
లింగాలఘన్పూర్, నవాబ్‌పేట ప్రాంతాలకు గోదావరి జలాలు తెచ్చింది కేసీఆరేనని పల్లా గుర్తుచేశారు. చెరువులు నింపడం నుంచి గ్రామాల అభివృద్ధి వరకు చేసినది బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. “నీకు నిజాయితీ ఉంటే… నవాబ్‌పేట గుళ్లోకి వచ్చి ప్రమాణం చేయి. నువ్వే నిధులు తెచ్చావా? జీవో తీసుకొచ్చావా? రేవంత్ తెచ్చాడా? చెప్పుకున్నందుకు సిగ్గు పడాలి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
“ఏది జరిగినా చేసినది కేసీఆర్… ప్రజలకు రావాల్సిన హక్కులు సమగ్రంగా ఇచ్చింది బీఆర్ఎస్. ఇదే మా పార్టీ బలం” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
