Stock Market | న‌ష్టాలలో ముగిసిన షేర్ మార్కెట్

ముంబ‌యి – దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటంతో పాటు, కీలక రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఫలితంగా, రెండు రోజుల పాటు కొనసాగిన లాభాలకు తెరపడింది. నిఫ్టీ సూచీ తిరిగి 24,850 స్థాయి దిగువకు పడిపోయింది.

సెన్సెక్స్ ఉదయం 82,038 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభమైన కొద్దిసేపటికే సూచీ భారీ నష్టాల్లోకి జారుకుంది. అయితే, ఆ తర్వాత కాస్త కోలుకుని లాభాల్లోకి ప్రవేశించి, 82,410 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మదుపరులు ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ అమ్మకాల హోరు మొదలైంది. దీంతో సూచీ ఏకంగా 81,121 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

రోజంతా తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన సెన్సెక్స్, చివరికి 624 పాయింట్ల నష్టంతో 81,551 వద్ద స్థిరపడింది. మరోవైపు, నిఫ్టీ కూడా 174 పాయింట్లు కోల్పోయి 24,826 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ సుమారు 1,300 పాయింట్ల పరిధిలో కదలాడటం గమనార్హం. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడింది. రూపాయి 27 పైసలు క్షీణించి రూ. 85.37 వద్ద ముగిసింది.

Leave a Reply