బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట..

బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట..
- రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
- 105 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
మక్తల్ , ఆంధ్రప్రభ ; తెలంగాణలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గురువారం రోజు మక్తల్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద 86 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, 19 మందికి షాదీ ముబారక్ మొత్తం 105 మంది లబ్దిదారులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పేదరికం కారణంగా ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడం కష్టతరంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్లు ఆనందంగా జరిపే అవకాశం ఏర్పడిందన్నారు.పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు కూడా సంతోషంగా జరగాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా బలహీన వర్గాల ప్రజల కోసమే ఆరు గ్యారెంటీలను ప్రకటించడం జరిగిందన్నారు.
ఆ పథకాలన్నింటిని అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గృహలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు చెప్పారు. పేదల సొంత ఇంటికి కలను నెరవేర్చడంలో భాగంగా ఇందిరమ్మ ఇంటి పథకం కొనసాగుతుందన్నారు.
నిరుపేదలందరికీ సొంత ఇంటిని నిర్మించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పారు. విడతలవారీగా ప్రతి ఒక్కరికి ఇండ్లను కేటాయిస్తామని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి వెల్లడించారు .మొదటి విడతగా రాని వారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తర్వాతి విడతల్లో అందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. గ్రామపంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించారని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని మంత్రి కోరారు.
మక్తల్ లో గత డిసెంబర్ మాసంలో జరిగిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు జాతరను ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా జరుపుకున్నామన్నారు. కోనేటిని పుణరుద్దరించుకుని స్నానమాచరించే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం జరగనున్న రంజాన్ పండుగను కూడా అంతే ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సోదరులతో కలిసిమెలిసి జీవించాలని అందరి సంక్షేమమే ప్రజా ప్రభుత్వం ధ్యేయమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, మాజీ జెడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్ మున్సిపల్ కౌన్సిలర్లు పావని, శ్రీవిద్య నీల గౌడ్, అనిత, సరిత గోవిందరావు, రహీం పటేల్ ,పీకే. నరసింహ, టప్ప కృష్ణ, వెంకటేష్ ,కాంగ్రెస్ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా ,బోయ రవికుమార్, అమరేందర్ రెడ్డి, బి. శంషుద్దీన్, ఊసాముద్దీన్, నూరుద్దీన్, సాలంబిన్ ఉమర్ బస్రవి,మంజూర్, కే .కురుమయ్య గౌడ్,చెన్నయ్య గౌడ్, జి.నీలప్ప ,మెదరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు 1000 మందికి రంజాన్ తోఫ ను మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు.
